అంతర్జాతీయ మహిళా దినోత్సవం - ఒకప్పుడు ఆడవారు ఉండేవారు...

బుధవారం, 8 మార్చి 2017 (16:06 IST)
నేడు అంతర్జాతీయ మహిళాదినోత్సవం. 1908 సంవత్సరం మార్చి 8వ తేదీన అమెరికా దేశంలోని మహిళలు తమకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు, వేతనలు కావాలనీ డిమాండ్ చేస్తూ చేపట్టిన భారీ నిరసన ఉద్యమం చేపట్టారు. ఈ చారిత్రక నేపథ్యాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం యావత్ ప్రపంచం మార్చి 8 తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతోంది. మహిళలకు మాత్రం ఇంకా సమానత్వం సిద్ధించలేదు. 
 
గృహిణిగా, శ్రమజీవిగా, ఉద్యోగిగా, ప్రజాప్రతినిధిగా, అన్ని రంగాల్లోనూ ప్రతిభావంతంగా పని చేస్తున్నా ఆమెకు తగిన గుర్తింపు రావడం లేదు. ఇప్పటికీ సమాన పనికి సమాన వేతనం దక్కడం లేదు. ప్రజాప్రతినిధులుగా స్థానం సంపాదించినా భర్తల చేతిలో కీలుబొమ్మలుగానే ఉన్నారు. మహిళల సమానత్వం ప్రచార ఆర్భాటాలకే తప్ప ఆచరణలో కానరావడం లేదు. నేటికీ మహిళగానూ, శ్రామిక మహిళగానూ, పౌరురాలిగానూ దోపిడీకి గురౌతూనే ఉంది. ఇన్ని సమస్యలున్నా కొందరు విజయం వైపు దూసుకెళ్తూ దేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు సుదూర స్వప్నంగానే మిగిలిపోయాయి.
 
సృష్టికి మూలం ఆడది. అసలు ఆడదే లేకపోతే సృష్టే లేదు. అంతటి మహోన్నత ప్రశస్తి కలిగిన మహిళ నేటి ప్రస్తుత నవ సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. సాటి సభ్య సమాజాన్ని చూసి ఆమె కన్నీరు పెడుతుంది..! ఆడపిల్ల పుట్టిందంటేనే భారంగా భావించే రోజులు దాపురించాయి. అసలు బయటి ప్రపంచాన్ని చూడకుండానే అసువులు బాసిన ఆడపిల్లలు కోకొల్లలు. ఏ దేశంలో లేని దుస్థితి మన దేశంలో ఎందుకు..? ఆడపిల్లని కనడం, చదివించడం, పెళ్లి చేయడం లాంటి తదితరాలన్నింటినీ భారంగా భావించే తల్లిదండ్రులు మన దేశంలో ఎందరో..! అసలు ఆడపిల్ల పుట్టిందంటేనే అదో పెద్ద శిక్షగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడపిల్లల సంఖ్య రోజురోజుకూ క్షీణిస్తుంది. రాబోయే భవిష్యత్తు కాలంలో ఒకప్పుడు ఆడవారు ఉండేవారు అని పుస్తకంలో ఒక చరిత్రలా చదువుకునే రోజులు ఎంతో దూరంలో లేవనే ఆందోళనలు సైతం రేగుతున్నాయి.
 
భారత రాజ్యాంగం, చట్టాల ప్రకారం దేశంలోని పౌరులందరికీ సమన అవకాశాలను కల్పించింది. ఆదర్శాలకీ వాస్తవాలకూ మధ్య చాలా సందర్భాల్లో పొంత్యన కుదరదన్న విషయాన్నే దేశంలో ఎల్లెడలా పరుచుకుపోయిన అసమానతలు చాటుతున్నాయి. వివిధ రంగాల్లో స్త్రీ పురుషుల మధ్య సామానత్వ సాధనలో ఏఏ దేశాలు ఎంతెంత వెనకబడి ఉన్నాయో ఆ నివేదిక కళ్లకు కడుతుంది. 2015 చివర్లో వెలువడిన నివేదిక ప్రకారం మొత్తం 145దేశాల పరిస్థితులను విశ్లేషిస్తే భారత్ గత ఏడాది(114) కన్నా కాస్త మెరుగై 108వ స్థానంలో ఉంది. ఆర్ధిక భాగస్వామ్యంలో 139, విద్యలో 125, వైద్యం, ఆరోగ్యంలో 143 వ స్థానాన్ని ఆక్రమించింది. సమానత్వ సూచీలో పేర్కొన్న గణాంకాల ప్రకారం 145 దేశాల్లో ఏ ఒక్కటీ స్త్రీ పురుష అంతరాలను తగ్గించడంలో వంద శాతం విజయం అందించలేదు. 
 
ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు 80 శాతం వరకు అధిగమించి సమానత సాధన దిశలో ముందు వరసల్లో ఉన్నాయి. బలమైన ఆర్ధిక వ్యవస్థలున్న సమాజాలు సమానత్వ సాధనలో వెనకబడిపోవడానికి మహిళా శక్తిని గుర్తించలేకపోవడంతో పాటు పాతుకుపోయిన పురుషాధిక్య భావజాలమూ ప్రధాన కారణమే. ముఖ్యంగా రాజకీయ, ఆర్ధిక రంగాల్లో ఈ తేడా అత్యధికంగా కనిపిస్తోంది.
 
భారత్‌లో మహిళలు పురుషులతో పోలిస్తే రోజూ అయిదు గంటల పాటు ఎలాంటి ప్రతిఫలం లభించని పని చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. పని విభజనలో తారతమ్యం ఏ దేశంలోనూ ఈ స్థాయిలో ఉండదు. ఆర్ధిక సాధికారతలో వెనకబాటుకు ప్రధాన కారణమదే. మహిళా యాజమాన్యంలోని సంస్థలు అతి తక్కువ శాతం ఉన్నదీ భారత్ లోనే. ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్లలో మహిళా కార్మిక శక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. కానీ మహిళల వార్షిక వేతనం చూస్తే ప్రస్తుతం స్త్రీలు సంపాదిస్తున్న జీతం పదేళ్ల క్రితం పురుషుడు సంపాదించిన దానితో సమానం. ప్రగతి బాటలో స్త్రీ పురుషుల మధ్య అంతరం తగ్గుతూ పోయిన కొద్దీ జీడీపీ పెరుగుతుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాజకీయ రంగంలో అంతరాలను అధిగమించిన దేశం సుసంపన్నం అవుతోంది. ఇకనైనా మహిళ స్థితిగతులు మారి, మన దేశం సుసంపన్నం కావాలని మనసారా కోరుకుందాం.

వెబ్దునియా పై చదవండి