తనకు ఎదురవుతున్న లైంగిక వేధింపులను వివరిస్తూ ఇచ్చిన ఫిర్యాదుపై కాలేజీ అంతర్గత విచారణ కమిటీ ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే ఓ విద్యార్థిని నిప్పంటించుకుందని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. లైంగిక వేధింపులపై తానిచ్చిన ఫిర్యాదును కళాశాల అంతర్గత విచారణ కమిటీ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు.
విద్యార్థిని ఫిర్యాదుపై కాలేజీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అంతర్గత విచారణ కమిటీ వేశారు. అయితే, కమిటీ విద్యార్థిని ఫిర్యాదును పట్టించుకోలేదు. తన ఫిర్యాదు చెల్లుబాటు కాకపోవడంతో విద్యార్థిని తీవ్ర నిర్ణయం తీసుకుంది అని మిశ్రా వెల్లడించారు.
సోషల్ మీడియాలో, కమిటీ ముందు, పోలీసులకు ప్రజలు ఇచ్చిన వాంగ్మూలాల్లో వైరుఢ్యాలు ఉన్నాయని మిశ్రా పేర్కొన్నారు. ఈ విషయంలో సరైన నిర్ణయానికి రావాలంటే ప్రతి వాంగ్మూలాన్ని క్షుణ్ణంగా విశ్లేషించడం అవసరమని ఆయన వివరించారు.
ఆమె ఫిర్యాదు చేసిందని, ఆ తర్వాత కళాశాల అధికారులు ఒక కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారని మిశ్రా వెల్లడించారు. ఈ కమిటీ దాదాపు 80 నుంచి 90 వాంగ్మూలాలు నమోదు చేసిందని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఆమె ప్రిన్సిపాల్ వద్దకు వెళ్ళిందని, ఆ తర్వాత ఏం జరిగిందో స్పష్టంగా లేదని డీజీ మిశ్రా వెల్లడించారు.