అమ్మ.. అంటే ఆనందం. కష్టం కలిగినా.. సంతోషం కలిగినా తొలి మాట అమ్మా.. అంటాం. తొమ్మిది నెలలపాటు కడుపులో ఉన్న బిడ్డ కోసం తపస్సు చేసి శిశువుకు జన్మనిచ్చే తల్లి కోసం ప్రపంచ వ్యాప్తంగా మే 14(ఆదివారం) మాతృదినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. అమ్మకు మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఉగ్గుపాలు పోసినప్పటి నుంచి.. తన కాలిపై స్వతహాగా నిలబడేంత వరకు బిడ్డను కంటికి రెప్పలా చూసుకునే అమ్మ గొప్పదనాన్ని స్మరించుకుంటున్నారు.
అలాంటి అమ్మకు మన తెలుగు సినిమారంగంలో విశిష్ట స్థానం ఉంది. జాతీయ స్థాయిలో కూడా అమ్మ పాటకు గుర్తింపు తెచ్చారు వేటూరి సుందరరామ్మూర్తి. మాతృదేవోభవ చిత్రంలో ‘వేణువై వచ్చాను భువనానికి...గాలినై పోతాను గగనానికి’ అంటూ ఎంతో హృద్యంగా సాగిన ఆ పాటకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. ఇలా ఎందరో గాయకులు, కవులు అమ్మ గొప్పదనాన్ని వెలుగెత్తి చాటారు.
అయితే నేటి ప్రపంచంలో అమ్మను చూసుకోవడం భారంగా భావించేవారు లేకపోలేదు. మనల్ని కంటికి రెప్పలా చూసుకునే తల్లికి వయస్సు పైబడితే భారంగా భావించి... వృద్ధాప్య ఆశ్రమంలో వదిలిపెట్టేయడం సహజమైంది. ఆధునికత పెరుగుతున్న కొద్దీ మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అలాంటి వారు మీరైతే అమ్మకు ప్రాధాన్యమివ్వండి.. అప్పుడే మీ పిల్లలు మీకు ప్రాధాన్యమిస్తారు.
లేకుంటే అమ్మకు ఏర్పడిన గతే భవిష్యత్తులో మీకు ఏర్పడక తప్పదని మానసిక నిపుణులు మాతృదినోత్సవం సందర్భంగా కీలక సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో అమ్మ ప్రాధాన్యతను తెలిపే పోస్టర్లు, ట్వీట్లు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా మదర్స్ డేను అందరూ అట్టహాసంగా జరుపుకుంటున్నారు. తమకు జన్మనిచ్చిన తల్లికి విలువైన కానుకలిచ్చి.. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సెలెబ్రిటీలు, ప్రముఖులు మదర్స్ డే సెలెబ్రేషన్స్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిలో బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వంటివారున్నారు.