భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు త్వరలోనే జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరపున మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడు రాష్ట్ర వాసి సీపీ రాధాకృష్ణన్ పేరును ఎంపిక చేశారు. అయితే, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేసినట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తమ కూటమిలోని అన్ని పార్టీలు మద్దతు తెలిపాయని ఆయన వెల్లడించారు.
ఇదే అంశంపై ఖర్గే మాట్లాడుతూ, దేశంలోని ప్రఖ్యాత న్యాయనిపుణుల్లో బి.సుదర్శన్ రెడ్డి ఒకరు. ఏపీ, గౌహతి హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టులో సేవలు అందించారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయంపై స్పష్టమైన అవగాహన కలిగి వ్యక్తి. ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఓ అభిప్రాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయి అని ఖర్గే పేర్కొన్నారు. ప్రతిపక్షాలన్నీ ఒకే పేరును అంగీకరించడం ఎంతో సంతోషంగా ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద విజయమని చెప్పారు.