అత్యాచారం చేసిన మహిళల తరపున పోరాడేందుకు కోటిన్నర జీతాన్ని వదులుకున్న మహిళా న్యాయవాది
శనివారం, 4 జులై 2020 (14:08 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
ఏకంగా 2 లక్షల డాలర్ల జీతం(భారత కరెన్సీలో సుమారు కోటిన్నర రూపాయలు). అది కూడా ఓ పెద్ద కార్పొరేట్ లా కంపెనీ నుంచి... ఎవరైనా వదులుకుంటారా..? రెజ గర్ది అనే యువ మహిళా న్యాయవాది మాత్రం వదిలేశారు. “పెద్ద మొత్తంలో జీతాలు, ఆకర్షణీయమైన కార్పొరేట్ ఉద్యోగాలు అనే ఆశల వల వేసేటప్పుడల్లా... ఈ విలాసవంతమైన జీవన శైలి కన్నా నా జీవితానికి ఓ పెద్ద పరమార్ధం ఉందన్న విషయాన్ని నేను పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాను” అని రెజ బీబీసీతో అన్నారు.
“నేను న్యాయవాద విద్యనభ్యసించడానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. నేను చట్టం శక్తిని అర్థం చేసుకోవడం ద్వారా సానుకూల మార్పును తీసుకురావాలనుకుంటున్నాను” అని ఆమె చెప్పారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) మిలిటెంట్లు బలవంతంగా ఎత్తుకెళ్లిన, అమ్మేసిన, వారి చేతుల్లో అత్యాచారాలకు గురైన మహిళలకు జరుగుతున్న న్యాయపోరాటంలో ఆమె భాగమయ్యారు. రెజ దృష్టిలో ఈ పోరాటానికి చాలా ప్రాముఖ్యత ఉంది. “నా తల్లి దండ్రులు ఇక్కడ నుంచి నన్ను మరో ప్రపంచానికి తీసుకెళ్లిపోయారు. కానీ నేను వారు తమ ప్రయాణాన్ని ఎక్కడ మొదలు పెట్టారో అక్కడికే చేరుకున్నాను.’’
‘నేను పెరిగిన వాతావరణమే కారణం’
రెజ 1991లో పాకిస్తాన్‌లోని ఓ శరణార్థి శిబిరంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు ఇరాక్ దేశానికి చెందిన కుర్దులు. సద్దాం హుస్సేన్ పాలనలో నాశనమైన తమ జీవితాల గురించి తన కుటుంబసభ్యులు, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు కథలు కథలుగా చెప్పడాన్ని వింటూ ఆమె పెరిగారు. ఏడేళ్ల వయసులో రెజ కుటుంబం న్యూజీలాండ్‌కు వెళ్లిపోయింది. గత ఏడాదే ఆమె తన విద్యాభ్యాసాన్ని ముగించారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఆమె న్యాయవాద పట్టా సాధించారు.
“నేను పెరిగిన వాతావరణ పరిస్థితులే నన్ను సమానత్వం, న్యాయం, మానవ హక్కులు వంటి అంశాల పట్ల ఆసక్తి చూపేలా చేశాయి. అన్యాయం, మానవ హక్కుల ఉల్లంఘన అన్న భావనలకు అర్థం తెలియక ముందే వాటిని నేను నా జీవితంలో ఎదుర్కొన్నాను” అని రెజ తెలిపారు. 2014లో ఉత్తర ఇరాక్‌లో జరిగిన ఘోరమైన దుర్మార్గాలకు సంబంధించిన ఆధారాలను ఆమె ఇప్పుడు చాలా జాగ్రత్తగా సేకరిస్తున్నారు.
ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ అధికారంలోకి వచ్చిన తర్వాత, వాళ్లు ముఖ్యంగా యజిదీలను లక్ష్యంగా చేసుకున్నారు. అప్పట్లో అక్కడ సుమారు 5 లక్షల మంది యజిదీలు ఉండేవారు. నిజానికి వాళ్లను మతం పట్ల విశ్వాసం లేని వాళ్లుగా ఇంకా చెప్పాలంటే మనుషుల కన్నా హీనంగా జూసేవారు ఐఎస్ జీహాదిస్టులు. ఒక్కసారిగా మిలిటెంట్లు మెరుపుదాడి చేయడంతో భయకంపితులైన వేలాది మంది గ్రామస్థులు దగ్గర్లో ఉన్న సింజార్ పర్వతానువుల వద్దకు వెళ్లిపోయారు. వందల మంది ఆ పర్వతం చాటున సురక్షితంగా ఉన్నప్పటికీ తట్టుకోలేని వేడి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.
వారికి పట్టుబడ్డ చాలా మంది పురుషుల్ని ఉరి తీసి చంపేశారు. “గత ఏడాది లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ ప్రచురించిన నివేదిక ప్రకారం ఆ దాడిలో సుమారు పదివేల మంది యజిదీలలో కొందరు ప్రాణాలు కోల్పోగా మరి కొందరు కిడ్నాప్‌నకు గురయ్యారు. ఐఎస్ చేతికి చిక్కిన మహిళలు, అమ్మాయిల కోసం బతికుండానే నరకం వేచి ఉంది.
“ఆ దారుణం నుంచి బతికి బయట పడ్డ వారి ముందు కూర్చొని వారి కథలు వింటున్నప్పుడు వారికి ఏ సాయం చెయ్యలేకపోయేదాన్ని. కానీ వాళ్ల భయంకరమైన అనుభవాలను విని చాలా బాధపడే దాన్ని” అని రెజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎస్ క్రూరత్వం రెజను కదిలించింది. “నేను ఎలాంటి సాయం చెయ్యలేను. కానీ ఒక వేళ నాకో, నా సోదరికో, నా తల్లికో లేదా నా బంధువులకో ఇటువంటి పరిస్థితి ఎదురైతే... ఎవ్వరైనా మాత్రం ఎందుకు వాటిని అనుభవించాలి?” అని రెజ ప్రశ్నించారు.
లైంగిక బానిసలు
ఈ నేరాలను చేసిన వాళ్లను గుర్తించడం, అందుకు సాక్ష్యాలను సంపాదించడం అంత సులభమైన పని కాదు. ఇప్పటికీ మీడియాకు, మానవ హక్కుల సంఘాల దృష్టికి రాని మహిళలపై ఆమె దృష్టి పెట్టాలనుకున్నారు. ఐఎస్ ఓ నిర్మాణాత్మకమైన వ్యవస్థ. యజిదీ ప్రజల్ని నాశనం చేయడమే వాళ్ల లక్ష్యం.
“వాళ్లు స్త్రీ-పురుషుల్ని వేరు చేస్తారు. ఆ పై స్త్రీలలో వృద్ధుల్ని-యుక్త వయసులో ఉన్న వారిని వేరు చేస్తారు. పెళ్లి కాని యువతులు సెక్స్ బానిసలుగా ఎక్కువ ధర పలుకుతారు. చాలా మంది వయసు మళ్లిన స్త్రీ, పురుషుల్ని అక్కడికక్కడే చంపేసేవారు.” మరింత పరిశోధన చెయ్యడం ద్వారా మిలిటెంట్లు ఒక్కొక్కరిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుందన్నది ఆమె ఆశ. మోసుల్ ప్రాంతంలోని ధనవంతులైన అరబ్బీలు ఇక్కడ మహిళల్ని కొనుక్కుంటూ ఉండేవారు.
న్యాయ పోరాటం
2014లో ఐఎస్ మిలిటెంట్ల చేతుల్లో దారుణమైన హింసకు, అత్యాచారానికి గురైన వారిలో నదియా మురాద్ ఒకరు. అప్పటికి ఆమె వయసు కేవలం 21 ఏళ్లే. అలుపెరగని ఆమె పోరాటాన్ని గుర్తిస్తూ 2108లో ఆమెకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు. అయితే చాలా మంది యజిదీ మహిళల్లా ఆమెకు కూడా న్యాయం జరగలేదు.
“కొందరు అనుమానితులు ఇరాక్‌లో దాక్కున్నారు. మరి కొందరు సిరియాలో యూరోప్‌లో ఉన్నారు. కొన్ని కేసుల్లో వారిని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తగిన బలమైన ఆధారాలు ఉన్నాయి” అని రెజ అన్నారు. కానీ ఇప్పటికీ సిరియా యుద్ధంలోనే ఉంది. అటు ఇరాక్‌లో న్యాయ వ్యవస్థ కూడా సమస్యల్లో పడింది.
అభియోగాలు
ఈ అవాంతరాలన్నింటినీ పక్కన బెడితే ఇటీవల తన 14 ఏళ్ల వయసులో ఉండగా అత్యాచారానికి గురైన అశ్వక్ హజి కేసులో నేరస్థుడైన ఐఎస్ మిలిటెంట్‌కి ఇరాక్ కోర్టు మరణశిక్ష విధించింది. ప్రస్తుతం జర్మనీలో ఉంటున్న అశ్వక్ తనను ఈ కేసులో సాక్ష్యం చెప్పేందుకు తిరిగి వచ్చారు.
జర్మనీలో ఓ వ్యక్తి ఓ తల్లి, బిడ్డను బానిసలుగా చేసుకొని ఆపై ఆమె ఐదేళ్ల చిన్నారిని చిత్రహింసలు పెట్టి చంపేశారు. ఈ కేసు 2020 ఏప్రిల్‌లో కోర్టు ముందుకు వచ్చింది. యూరోప్‌లో ఉన్న యజిదీ బాధితులకు సంబంధించిన తొలి కేసు ఇది. “న్యాయం జరగడానికి ఏళ్లు పట్టవచ్చు. నిజానికి సాక్ష్యాలను సేకరించడమే సుదీర్ఘమైన ప్రక్రియ. కానీ కొన్ని విజయాలను మేం చూశాం. అవే ఈ కేసులో మా ఆశల్ని సజీవంగా ఉంచుతున్నాయి” అని ఆమె అన్నారు.
కుటుంబ చరిత్ర నుంచి పాఠాలు
సద్దాం హుస్సేన్ పాలనా కాలంలో ఆమె కుటుంబం ఎన్నో బాధలు పడ్డప్పటికీ రెజ మాత్రం ఆశాజనంగానే ఉన్నారు. “నా బామ్మ, మా అమ్మకు చెందిన ఇద్దరు సోదరులు ఓ రసాయన దాడిలో చనిపోయారు. ఆ దాడి కారణంగా మా తాతగారు అంగవైకల్యం పాలయ్యారు. పదేళ్ల వయసులోనే తన కళ్ల ముందు తన తల్లి చనిపోవడాన్ని కళ్లారా చూసింది మా అమ్మ. ఆపై ఆ చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని తన నెత్తిన వేసుకుంది” అని రెజ తన తల్లి ఎదుర్కొన్న దారుణ పరిస్థితుల్ని వివరించారు.
1988లో సుమారు 50 వేల నుంచి లక్ష మంది కుర్దుల్ని పొట్టనబెట్టుకున్నారని మానవ హక్కుల సంఘాల అంచనా. అయితే కుర్దు వర్గాలు మాత్రం ఆ సంఖ్య లక్ష 80 వేల వరకు ఉంటుందని చెబుతాయి. సద్దాం వెంటనే ఉరిశిక్ష అమలు చేయడంవల్ల వారికి న్యాయం కోరే అవకాశం కూడా రాలేదని రెజ వాదిస్తారు. ఆమె దృష్టిలో ఈ మారణహోమానికి సంబంధించి ఎప్పుడు ఆయనపై అధికారికంగా అభియోగాలు నమోదు కాలేదు.
“అందుకే యజిదీలు పడుతున్న బాధ నన్ను కదలిస్తూ ఉంటుంది. వారి కోసం నేను పోరాడుతున్నప్పుడు సద్దాం చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన కుర్దుల గురించి పోరాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది” అని ఆమె చెప్పారు. కుర్దులకు జరిగిన బాధల్ని పక్కనబెడితే తాను చూసిన యజిదీల పరిస్థితి మరీ ఘోరం అని అంటారామె. “ఉన్న అల్ప సంఖ్యాక వర్గంలో యజిదీ కుర్దులు మరింత అల్ప సంఖ్యాక వర్గంలో ఉన్నారు. దీంతో వారి పరిస్థితి మరీ దారుణం” అని తెలిపారు.
ఇంకెప్పుడూ జరగకూడదు
ఐఎస్ చేసిన దారుణాలపై ఐక్య రాజ్య సమితి ఓ దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇక ఆధారాల విషయానికి వస్తే ప్రపంచమంతా గుర్తుంచుకున్న విషయాలే ఐఎస్ నేరస్థుల్ని వేటాడటంలో తనకు సహాయపడతాయని రెజ ఆశాభావం వ్యక్తం చేశారు. “రసాయన ఆయుధాలతో కుర్దుల చిన్నారుల్ని సద్దాం హుస్సేన్ చంపేసినప్పుడు ఆ వార్త ప్రపంచానికి చేరేసరికి చాలా సమయం పట్టింది. అయితే యజిదీలకు ఏం జరిగిందన్నది యావత్ ప్రపంచం చూసింది” అని రెజ గుర్తు చేశారు.
యజిదీ మహిళలకు తప్పకుండా న్యాయం జరుగుతుందని, అది భవిష్యత్ తరాల వారికి కూడా ఉపయోగ పడుతుందని ఆమె ఆశాభావంతో ఉన్నారు. అది బాధితులకు వ్యక్తిగతంగా ఉపశమనం కల్గిస్తుందన్న విషయాన్ని పక్కన బెడితే భవిష్యత్తులో మరోసారి ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చట్టం అడ్డుకుటుందని ఆమె నమ్ముతున్నారు. “మెరుగైన ప్రపంచం కోసం, మళ్లీ ఇటువంటి పరిస్థితులు ఎప్పుడూ తలెత్తకుండా ఉండటం కోసం మేం పోరాడాల్సిన అవసరం ఉంది” అని రెజ ధృడంగా చెప్పారు.