'ససెప్టబుల్, అన్‌డిటెక్టడ్, టెస్ట్‌డ్ (పాజిటివ్), అండ్ రిమూవ్డ్ అప్రోచ్' (సూత్రా) అనే గణిత నమూనా ఆధారంగా కాన్పుర్, హైదరాబాద్‌లోని ఐఐటీ శాస్త్రవేత్తలు ఈ అంచనాలు వేశారు. గత వారం కూడా వీరు కొన్ని విశ్లేషణలు చేశారు. మే 11-15 మధ్య ఈ మహమ్మారి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని, ఆ సమయంలో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 33-35 లక్షల మేర ఉండొచ్చని ఆ అంచనాల్లో చెప్పారు.
మే నెలాఖరుకు కేసులు గణనీయంగా తగ్గొచ్చని కూడా నాడు తెలిపారు. ఏప్రిల్ 15 నాటికి భారత్‌లో క్రియాశీల కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని ఈ నెల మొదట్లో వారు చేసిన అంచనాలు తప్పాయి. ఇప్పుడు కొన్ని సవరణలు చేశారు. ''ఈ దఫా అంచనాలకు సంబంధించి కనిష్ఠ, గరిష్ఠ వివరాలనూ లెక్కించాం. అందువల్ల మేం ఊహించిన శ్రేణిలోనే వాస్తవ విలువలు ఉంటాయని కొంతవరకూ ధీమాగా చెప్పగలను'' అని అధ్యయనంలో పాల్గొన్న మణిందర్ అగర్వాల్ చెప్పారు.