ఇజ్రాయెల్ - ఇరాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు - పతనమవుతున్న సెన్సెక్స్

వరుణ్

సోమవారం, 5 ఆగస్టు 2024 (12:52 IST)
ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్లకు ప్రతికూలంగా మారాయి. గ్లోబల్ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో మదుపర్ల సెంటిమెంట్ బలహీనమైంది. పర్యవసానంగా సోమవారం భారత స్టాక్ మార్కెట్‌లు తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్ నిఫ్టీ, సెన్సెక్స్ రెండు సూచీలు తీవ్ర నష్టాలను నమోదు చేశాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ ఏకంగా 1,533.11 పాయింట్లు పతనమై 79,448.84 వద్ద, నిఫ్టీ 463.50 పాయింట్లు నష్టపోయి 24,254.20 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. 
 
రికార్డు స్థాయిలో కొన్ని వారాల పాటు లాభాల బాటలో పయనించిన మార్కెట్‌లు సోమవారం నష్టాల్లోకి జారుకున్నాయి. ఐటీ స్టాక్స్ తీవ్ర నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌ టాటా మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, మారుతీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. కాగా సన్ ఫార్మా, హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు పాజిటివ్‌వా ట్రేడ్ అవుతున్నాయి. ఈక్విటీ మార్కెట్లతో పాటు దేశీయ కరెన్సీ రూపాయి విలువ కూడా గణనీయంగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 83.80కి దిగజారి ఆల్ టైమ్ కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. 
 
అమెరికా ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అంచనాలను అందుకోలేకపోయాయి. జులై నెలలో అమెరికాలో ఉద్యోగాల వృద్ధి ఊహించిన దాని కంటే చాలా అధికంగా మందగించింది. దీంతో ఆర్థిక మందగమనం తప్పదనే భయాలు మరింత పెరిగాయి. ఈ ప్రభావం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లపై పడవచ్చనే విశ్లేషణలు గ్లోబల్ మార్కెట్లను కుంగదీశాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. మరోవైపు ఇజ్రాయెల్ - ఇరాన్, హిజ్బుల్లా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా మార్కెట్లను భయపెడుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు