చైనా వెజ్ పకోడా టేస్ట్ చేయండి!

సోమవారం, 16 జూన్ 2014 (17:50 IST)
కూరగాయల్లో ఎన్నో పోషకాలున్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు. కూరగాయల్లో కేలరీలు తక్కువగా ఉన్నందున ఇవి ఊబకాయాన్ని దరిచేరనివ్వవని వారు చెబుతున్నారు. అలాంటి వెజిటబుల్స్‌తో పకోడీ చేస్తే ఎలా ఉంటుంది. అందుకు కాస్త చైనా స్టైల్లో ట్రై చేసి చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు : 
క్యాబేజీ - 150 గ్రాములు,
క్యారెట్ - 100 గ్రాములు, 
ఉల్లిపాయలు - రెండు, 
క్యాప్సికమ్ - ఒకటి, 
పచ్చిమిర్చి సాస్ - రెండు టీస్పూన్లు, 
సోయాసాస్ - టీస్పూన్, 
టమోటా సాస్ - అరటీస్పూన్, 
తీపి లేని రస్కు పొడి - టేబుల్ స్పూన్, 
కార్న్‌ఫ్లోర్ - టేబుల్‌స్పూన్, 
ఇన్‌స్టంట్ వెజ్ పౌడర్ - రెండు టేబుల్ స్పూన్లు, 
శెనగపిండి - రెండు టేబుల్ స్పూన్లు, 
మైదాపిండి - రెండు టేబుల్ స్పూన్లు, 
నూనె- అర లీటరు, 
ఉప్పు - తగినంత.
 
తయారు చేయు విధానం :
ముందుగా క్యాబేజీ, క్యారెట్లను సన్నగా పొడవుగా తరిగి పెట్టుకోండి. ఉల్లిపాయ, క్యాప్సికమ్‌లను తరిగి పెట్టుకోండి. వీటిని ఫ్రిజ్‌లో మూత పెట్టకుండా ఓ పాత్రలో అరగంట సేపు ఉంచండి. తర్వాత వీటిని తీసి సోయా సాస్, మిర్చి సాస్, ఉప్పులను కలిపి వెజ్ పౌడర్‌ను కలిపి మరో పావుగంట పాటు ఫ్రిజ్‌లో ఉంచండి.
 
తర్వాత దీనిని తీసుకుని ఇందులో రస్కు పొడి, పిండులను వేసి కలిపి పకోడా పిండిలా కలుపుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక, అందులో ఈ పిండిని పకోడాల్లాగా వేసి బంగారు వన్నె వచ్చేంత వరకు వేయించి దించి టమోటా సాస్ లేదా చిల్లీ సాస్‌తో సర్వ్ చేయండి.

వెబ్దునియా పై చదవండి