తెలంగాణ రాష్ట్రంలోని పాలమూరు జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 15 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకింది. ఈ విషయం బయటకు పొక్కకుండా వారందరిని ఐసోలేషన్‌లోనే ఉంచి వైద్యం అందిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
జిల్లాకు చెందిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, జిల్లా కలెక్టర్ శశాంక, వైద్యాధికారులతో ఫోనులో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం చేయాలని ఆదేశించారు. అలాగే, విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందవద్దని వారు సూచించారు.
కాగా, ఈ గురుకుల పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర విద్యార్థులతో కలిపి మొత్తం 378 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఇంటర్ విద్యార్థులు మాత్రం పరీక్షలు ముగిసిన వెంటనే తమ సొంతూర్లకు వెళ్లిపోయారు. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థులు రెడ్యాల ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
మిగతా 252 మంది విద్యార్థులు గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ఉంటున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో విద్యా ర్థులు, సెక్యూరిటీ గార్డ్ బాధపడుతున్నారని తెలుసుకున్న ఏఎన్‌ఎం వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని కరోనా టెస్టులు చేయగా, 15 మంది విద్యార్థులకు ఈ వైరస్ సోకినట్టు నిర్దారణ అయింది.