కరోనా కేసులు : తెలంగాణాలో డబుల్ సెంచరీ.. ఆంధ్రాలో సెంచరీ

గురువారం, 11 జూన్ 2020 (22:16 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. గురువారం ఒక్క రోజే తెలంగాణాలో కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 
 
ఈ కొత్తగా నమోదైన 209 కేసుల్లో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 175 పాజటివ్ కేసులు ఉన్నాయి. మేడ్చల్‌ జిల్లాలో 10, రంగారెడ్డిలో 7, వరంగల్‌ అర్బన్‌లో 2, మహబూబ్‌నగర్‌లో 3, ఆసిఫాబాద్‌లో 2, సిద్దిపేటలో 2, కరీంనగర్‌లో 3, ములుగు, కామారెడ్డి, వరంగల్‌ రూరల్‌, సిరిసిల్ల జిల్లాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదు అయ్యాయి. 
 
రాష్ట్రానికి వలస వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,320కు చేరగా, మృతుల సంఖ్య 165కు చేరింది. ఆస్పత్రిలో 2,162 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. 
 
ఇకపోతే, ఆంధ్రప్రదేశ్‌లో కొవిడ్‌-19 కేసులు మరిన్ని పెరిగిపోయాయి. గత 24 గంటల్లో 11,602 శాంపిళ్లను పరీక్షించగా మరో 135 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 65 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
 
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 4,261 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,641 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,540 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 80కి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు