దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హర్యానా, కేరళ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు.. పాజిటివ్ కేసులు పెరగడంతో అప్రమత్తమైన కేంద్రం.. కఠిన చర్యలకు పూనుకుంటుంది.. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాలకు కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 40వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 111 రోజుల తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అటు, మహారాష్ట్రపై కరోనా పంజా విసురుతోంది. రికార్డుస్థాయిలో అక్కడ కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ సిటీలో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. నిత్యావసరాల దుకాణాలు, కూరగాయల మార్కెట్స్ సాయంత్రం 4 గంటల వరకు తీసి ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. రెస్టారెంట్లు రాత్రి 7 గంటల వరకు తీసి ఉంటాయని, పాఠశాలలు, కళాశాలలు మార్చి 31 వరకు మూసివేయబడతాయని మంత్రి నితిన్ రౌత్ చెప్పారు.
కరోనా కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని.. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ హాట్ స్పాట్లుగా ఉన్న ప్రాంతాల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరుగుతోన్న సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ మహమ్మారి సెకెండ్ వేవ్ మొదలయ్యింది.