ఆంధ్రాలో అమాంతం పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు

సోమవారం, 20 ఏప్రియల్ 2020 (13:50 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 75 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ 75 కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 722. ఇందులో 92 మంది డిశ్చార్జ్ అయ్యారని, 20 మంది మరణించారని పేర్కొంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 610గా తెలిపింది.
 
కాగా, రాష్ట్రంలో కరోనా హాట్ స్పాట్‌గా కర్నూలు మారింది. ఇక్కడే అత్యధికంగా 174 కేసులు నమోదయ్యాయి. వీరిలో 168 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, ఐదుగురు చనిపోయారు. ఒకరు కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అత్యధికంగా 149 కేసులు నమోదయ్యాయని ఏపీ సర్కారు చెప్పింది. గుంటూరులో 130 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటుండగా, 15 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
 
ఈ రెండు జిల్లాల తర్వాత అత్యధికంగా కృష్ణా జిల్లాలో 80 మందికి కరోనా సోకగా, 60 మందికి చికిత్స అందుతోంది... 14 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరులో 67 కేసులు నమోదు కాగా, 65 మందికి చికిత్స అందుతోంది.
 
ఒకరు డిశ్చార్జ్‌ కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరులో 24 గంటల్లో 25 మందికి కరోనా నిర్ధారణ కావడంతో ఆ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య 53కి చేరింది. ప్రకాశం జిల్లాలో 44 మందికి కరోనా నిర్ధారణ అయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

జిల్లాల వారీగా పరిశీలిస్తే, అనంతపూర్ 33, చిత్తూరు 53, ఈస్ట్ గోదావరి 26, గుంటూరు 149, కడప 40, కృష్ణ 80, కర్నూలు 174, నెల్లూరు 67, ప్రకాశం 44, విశాఖపట్టణం 21, వెస్ట్ గోదావరి 35 చొప్పున కేసులు నమోదు కాగా, శ్రీకాకుళం, విజయనగరంలలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు