టీమిండియా జట్టు విజయాల బాటలో నడుస్తున్నంత కాలం తన వయస్సూ, అనుభవం గురించి ఎవరికీ ఎలాంటి సందేహాలు రావని, ఒకటి రెండు మ్యాచ్‌లు ఓడిపోతే ఇక నేను అనవసరం అనే వ్యాఖ్యలు ముఖంమీదే చేస్తారని టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా స్పష్టం చేశారు. ఇంగ్లండ్‌పై రెండో టీ-20 మ్యాచ్‌లో బుమ్రాతో కలిసి బౌలింగ్‌లో అదరగొట్టిన నెహ్రా వయసు పెరిగాక ఏ క్రికెటర్ అయినా ఫిట్‌గా ఉండటం ఎంత కష్టమో తనకు తెలుసని వ్యాఖ్యానించాడు.
‘‘ప్రధానంగా నేను ఫాస్ట్ బౌలర్‌ని. మ్యాచ్ ప్రారంభంలో.. చివర్లో బౌలింగ్ చేస్తుంటాను. ‘ఫిట్‌గా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. నేను ఆటను ఆస్వాదిస్తున్నాను. ఫిట్‌నెస్ ఉన్నంతవరకు ఆడడానికి ప్రయత్నిస్తాన’’ని చెప్పాడు నెహ్రా. ‘‘వయసు అంటే నా వరకు ఒక నంబర్ మాత్రమే. అయితే బాగా ఆడుతున్నంత కాలం పొగుడుతారు. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడిపోతే జట్టులో మిగతావారిని వదిలేసి.. ఇక నెహ్రా అనవసరం. తీసేసి ఉండాల్సింద’’ని అంటారని వాపోయాడు.
ఏడెనిమిది నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాను. ప్రాక్టిస్ తక్కువైందని నాకెప్పుడూ అనిపించదు. ఎప్పుడూ ఎక్కడో అక్కడ ఆడుతుండడం వల్ల కావచ్చు. ఒక్క మ్యాచ్ ఆడితే చాలు.. మళ్లీ గాడిలో పడిపోతాను. అన్నింటికంటే అనుభవం ముఖ్యమ’’ని నెహ్రా చెప్పాడు. నెహ్రా వయస్సు 37 ఏళ్లు. అతడు కనిపిస్తే చాలు అందరూ అతడి వయస్సు గురించే మాట్లాడుతుండటం తనను చిర్రెత్తిస్తుంది.
రెండో టీ20లో రెండు వరుస బంతుల్లో రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు నెహ్రా. తర్వాత మరో వికెట్ కూడా అతని ఖాతాలో చేరడంతో స్టేడియంలో నెహ్రా పేరు మార్మోగింది. వ్యాఖ్యాతలు కూడా ‘నెహ్రాజీ’ అంటుండడం పెద్దవాడిగా అతనికిచ్చే గౌరవం. కానీ వయస్సు కంటే అనుభవమే గొప్పదనే నెహ్రా ప్రస్తుతం టీ-20 మ్యాచ్‌లలో, ఐపీఎల్ మ్యాచ్ లలో కూడా టీమిండియాకు, సంబంధింత జట్టుకు తురుపుముక్కలా ఉపయోగపడుతుండటం విశేషం.