ఈనెల 24వ తేదీన డెహ్రాడూన్ నుంచి కారులో ఢిల్లీ వెళ్తూ షమీ ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో షమీ గాయపడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహాన్ చికిత్స పొందుతున్న షమీని కలిసేందుకు ఆస్పత్రికి వెళ్లింది. అయితే, షమీ ఆమెను కలిసేందుకు నిరాకరించాడు.
దీనిపై జహాన్ స్పందిస్తూ, 'ప్రమాదంలో గాయపడిన షమీని కలవాలని అనుకున్నా. కానీ నన్ను కలిసేందుకు అతడు నిరాకరించాడు. అంతేకాదు, నన్ను బెదిరించాడు. ఇక మేమిద్దరం కోర్టులోనే కలుసుకుంటాం' అంటూ హెచ్చరికలు చేసింది. షమీ తన కుమార్తెతో ఆడుకున్నాడని, కానీ తనను మాత్రం కలిసేందుకు నిరాకరించాడని, షమీ తల్లి అతడికి బాడీగార్డులా పనిచేస్తున్నారని హసీన్ ఆరోపించారు.
అంతేకాకుండా, అతడు తనను వద్దనుకుంటున్నా, తాను మాత్రం అతడిని ప్రేమిస్తూనే ఉన్నానని, ఎందుకంటే, అతడు తన భర్త అని హసీన్ చెప్పుకొచ్చింది. పైగా, అతడు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పిన హసీన్ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత కోర్టులో కలుసుకుందామంటూ షమీకి హెచ్చరికలు పంపారు.