ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం దుబాయ్ వేదికగా తొలి సెమీ ఫైనల్ పోటీ జరుగనుంది. ఇందులో ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో ఆసీస్‌పై భారత జట్టు చివరిసారిగా 2011 వన్డే ప్రపంచ కప్ క్వార్టర్ మ్యాచ్ గెలిచింది. ఆ తర్వాత 2023 వరల్డ్ కప్ ఫైనల్, 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, ఐసీసీ టెస్ట్ చాంపియన్స్ ఫైనల్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత్‌ను ఇంటిముఖం పట్టించారు. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆస్ట్రేలియా ఎదురుపడితే వామ్మో అనిపిస్తుంటుంది.
తాజాగా చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను దక్కించుకోవాలంటే ముందు ఆస్ట్రేలియా గండాన్ని అధికమించాల్సి వుంటుంది. ఇప్పటికే దుబాయ్‌లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న భారత్ ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్‌గా ఉంది. అయితే, ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెట్టింపు ఉత్సాహంతో కంగారులు ఆడుతుంటారు. అయితే, ఈ దఫా ఆసీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూపు దాటడం కూడా కష్టమేనని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆస్ట్రేలియా జట్టు చాంపియన్స్ ట్రోఫీలో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తుంది. దీంతో నేటి మ్యాచ్‌లో భారత బౌలింగ్‌కు ఆస్ట్రేలియా బ్యాటింగ్‌కు మధ్య రసవత్తర పోరు జరుగనుంది.
భారత పాకిస్థాన్ మ్యాచ్ కోసం వాడిన పిచ్‌పైనే తొలి సెమీస్ పోరు జరుగనుంది. వికెట్ స్పిన్‌కు అనుకూలించనుంది. మంచు ప్రభావం కనిపించడం లేదు. దీంతో టాస్ నెగ్గిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్ కోసం ఆన్‌ఫీల్డ్ అంపైర్లను ఐసీసీ ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన గఫానే, ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ మైదానంలో అంపైర్లుగా వ్యవహరిస్తారు. ఇక థర్డ్ అంపైర్‌గా మైకేల్ గాఫ్, మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ ఉంటారు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి దుబాయ్ వేదికగా జరుగనుంది.
ఈ మ్యాచ్ కోసం తుది జట్ల అంచనా...
భారత్ : రోహిత్ శర్మ, కోహ్లి, గిల్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, జడేజా, కల్దీప్ యాదవ్, షమీ, వరుణ్ ధావన్.
ఆస్ట్రేలియా : హెడ్, ఇన్‌గ్లిస్, స్మిత్, లబుషేన్, కూపర్, క్యారీ, మ్యాక్స్‌వెల్, డ్వార్షిస్, ఎల్లిస్, జాన్సన్, జంపా.