చాంపియన్స్ ట్రోఫీ : సెమీస్‌లో భారత్ ప్రత్యర్థి ఎవరు? ఆసక్తికరంగా సమీకరణాలు!

ఠాగూర్

గురువారం, 27 ఫిబ్రవరి 2025 (18:32 IST)
పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు సాగుతున్నాయి. గ్రూపు-ఏ నుంచి భారత్ మొదటి స్థానంలో ఉంటే రెండో స్థానంలో న్యూజిలాండ్ జట్టు ఉంది. ఈ రెండు జట్లూ వరుసగా రెండేసి మ్యాచ్‌లు గెలిచి మొదటి, రెండు స్థానాల్లో ఉన్నాయి. 
 
ఇక గ్రూపు-బిలో మాత్రం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు నాలుగేసి పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాత ఆప్ఘనిస్థాన్ ఒక గెలుపుతో మూడో స్థానంలో ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోయిన ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలించింది. గ్రూపు-ఏ నుంచి పాకిస్థాన్ జట్టు కూడా ఇంటికి వెళ్లింది. ఇపుడు సెమీస్‌లో భారత జట్టుతో ఏ జట్టు తలపడుతుంది అనే దానిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతుంది. 
 
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌‍లో విజేత గ్రూపు ఏలో అగ్రస్థానంలో నిలుస్తుంది. గ్రూపు-బిలో రెండో స్థానంలో నిలిచిన జట్టుతో మార్చి 4వ తేదీన భారత్ సెమీ ఫైనల్-1లో తలపడుతుంది. 
 
ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మిగిలిన ఒక్కో మ్యాచ్‌లో గెలిచి న్యూజిలాండ్‌ను టీమిండియా ఓడిస్తే తొలి సెమీస్‌ భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతుంది. కివీస్ చేతిలో భారత్ ఓడిపోతే, దక్షిణాఫ్రికా - భారత్‌ల మధ్య తొలి సెమీస్ జరుగుతుంది.  
 
ఆస్ట్రేలియాను ఆప్ఘనిస్థాన్ జట్టు ఓడించి, ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం సాధిస్తే గ్రూపు-ఏలో భారత్ అగ్రస్థానంలో ఉంటే ఆప్ఘనిస్థాన్‌తో తలపడుతుంది. ఒకవేళ భారత్, న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే సౌతాఫ్రికాను ఢీకొడుతుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాలు తమతమ మ్యాచ్‌లలో ఓడితే భారత్, ఆప్ఘాన్‌ల మధ్య తొలి సెమీ ఫైనల్ జరుగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు