ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా, భారత మహిళా జట్టు ఘోర పరాజయం చవిచూసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికా మహిళ జట్టుతో జరుగుతున్న ఐదు టీ-20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన ఉత్సాహంలో ఉన్న భారత మహిళ జట్టు ఆదివారం జరిగిన మ్యాచ్‌లో మాత్రం చిత్తుగా ఓడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి దక్షిణాఫ్రికా మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. సఫారీ బౌలర్ షబ్నిం ఇస్మాల్ ఐదు వికెట్లు పడగొట్టి భారత్‌ను కష్టాల్లో పడేసింది. దీంతో 17.5 ఓవర్లలో 133 పరుగులు చేసి భారత జట్టు ఆలౌట్ అయింది. భారత బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 48, సృతి మంధాన 37 మినహా మిగితా వారందరూ స్వల్ప స్కోర్‌కే పరిమితమయ్యారు.
ఆ తర్వాత 134 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ అమ్మాయిలు చెలరేగి ఆడారు. కెప్టెన్ నెక్రిక్(26), సెన్ లూస్(41) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆఖర్లో ట్రైయాన్(34) భారీ షాట్లతో బాది జట్టుకు విజయాన్ని కట్టబెట్టింది. దక్షిణాఫ్రికా 19 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.