పరుగుల ప్రవాహంలో తడిసి ముద్దయిన ముంబై... సిరిస్ భారత్ వశం

గురువారం, 12 డిశెంబరు 2019 (10:03 IST)
సముద్రతీర ప్రాంతమైన ముంబై పరుగుల ప్రవాహంలో తడిసి ముద్దయింది. సిరీస్ తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో భారత క్రికెటర్లు చాంపియన్ ఆటతీరును తలపించారు. ఫలితంగా ముంబై వేదికగా బుధవారం జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో కోహ్లీ సేన 67 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. తద్వారా మూడు ట్వంటీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 
 
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్... 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 240 పరుగుల భారీ స్కోరును చేసింది. ఇందులో ఓపెనర్లు రోహిత్ శర్మ 34 బంతుల్లో ఐదు సిక్స్‌లు, ఆరు ఫోర్ల సాయంతో 71 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 56 బంతుల్లో 4 సిక్స్‌లు, 9 ఫోర్లు బాది మొత్తం 91 పరుగులు చేశాడు. 
 
ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ 29 బంతుల్లో ఏడు సిక్స్‌లు, నాలుగు ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసి నాటౌట్‌గా నిలువగా, రిషబ్ పంత్ డకౌట్ అయ్యాడు. విండీస్ బౌలర్లలో కాట్రెల్‌, విలియమ్స్‌, పొలార్డ్‌ ఒక్కో వికెట్‌ చొప్పున తీశారు. 
 
ఆ తర్వాత 241 పరుగుల భారీ లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు 8 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. భారత బౌలర్లు చాహర్‌(2/20), భువనేశ్వర్‌(2/41), షమీ(2/25), కుల్దీప్‌(2/45) ధాటికి కుప్పకూలింది. కెప్టెన్‌ పొలార్డ్‌(39 బంతుల్లో 68, 5ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్థ సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. హిట్‌మైర్‌(41) ఆకట్టుకున్నాడు. కాగా, కేఎల్ రాహుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, కెప్టెన్ విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు