మిస్టర్ కూల్‌గా పేరొందిన జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీకి కోపమొచ్చింది. అంతే ఊగిపోతూ '300 మ్యాచ్‌లు ఆడా, పిచ్చోడినా' అంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడట. ఇంతకీ ఈ వార్నింగ్ ఎవరికిచ్చాడో తెలుసా.. జట్టు సహచర సభ్యుడు కుల్దీప్ యాదవ్‌కే. ఈ విషయం ఎలా పొక్కిందన్నదే కదా మీ సందేహం. అలాంటి స్వీట్ వార్నింగ్ తీసుకున్న బౌలరే వెల్లడించారు.
తాజాగా ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కుల్దీప్ యాదవ్ గుర్తుచేశారు. 'శ్రీలంకతో జరిగిన టీ-20 మ్యాచ్‌లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టార్గెట్ ఛేదించడానికి శ్రీలంక కూడా జోరుగా ఆడుతోంది. ఆ సమయంలో నేను బౌలింగ్ చేస్తున్నా. నేను వేసిన ప్రతీబంతిని బ్యాట్స్‌మెన్ బౌండరీకి పంపుతున్నారు. అప్పుడు ధోనీ నన్ను పిలిచాడు. ఫీల్డ్ మార్చుకొని బౌలింగ్ చేయి అన్నారు. నాకు తెలుసు.. నువ్వు కూల్‌గా ఉండు ధోనీ అన్నా. దీంతో ఆయన నాపై మండిపడ్డారు. 300 మ్యాచ్‌లు ఆడాను. నేనేమన్నా పిచ్చోడినా. నేను చెప్పినట్టు చేయ్ అంటూ కోపగించుకున్నారు. ఆ తర్వాత ధోనీ చెప్పినట్టే బౌలింగ్ వేశా. ఆ ఓవర్‌లో వికెట్ పడింది. దీంతో ధోనీ నా దగ్గరకి వచ్చి నేను చెప్పింది ఇదే కదా అన్నారు' అని కుల్దీప్ వెల్లడించారు.