బాలుడు అపహరణ కేసు : మేనత్త కూతురే కిడ్నాపర్ 
	 
	డబ్బు కోసం ఓ యువతి కిడ్నాప్ అవతారమెత్తింది. రూ.6 లక్షలు ఇవ్వకుంటే బాలుడుని చంపేస్తానంటూ బెదిరించింది. ఇంతకీ ఇలా బెదిరింపులకు పాల్పడింది ఎవరో కాదు... సొంత మేనత్త కూతురే. తనకు ఆరు లక్షల రూపాయలు ఇవ్వకపోతే బాలుడుని హత్య చేస్తానంటూ బెదిరించింది. ఈ కిడ్నాప్ వ్యవహారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు... కేవలం కొన్ని గంటల్లోనే కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, బాలుడుని సురక్షితంగా రక్షించించి పోలీసులకు అప్పగించారు.
 
									
				
	 
	ఈ కిడ్నాప్ ఘటనపై తూర్పు విభాగపు డీఎస్పీ అబ్దుల్ అజీజ్ సోమవారం విలేకరులకు వివరించారు. ఆర్టీసీ కాలనీకి చెందిన షేక్ షఫీఉల్లా మేనత్త కుమార్తె పటాన్ షకీలా కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా గత వారం రోజులుగా ఆయన ఇంట్లోనే ఉంటోంది. బాలుడిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలన్న ఉద్దేశంతో ఆదివారం మధ్యాహ్నం తన వెంట తీసుకెళ్లిపోయింది. 
 
									
				
	 
	ఆమె బాలుడితో విజయవాడ బస్‌స్టేషన్‌లో ఉన్నట్టు గుర్తించి గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. షకీలాను అరెస్టు చేశారు. కేసులో శరవేగంగా స్పందించి బాలుడిని కాపాడిన పాతగుంటూరు సీఐ వెంకటప్రసాద్, ఎస్ఐ ఎన్‌సీ ప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ నూరుద్దీన్, కానిస్టేబుళ్లను ఎస్పీ అభినందించారు.