ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కారు డ్రైవర్ భార్య ఆత్మహత్య చేసుకుంది. చట్నీ విషయంలో భర్తతో గొడవడిన ఆమె ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన రమణ, బానోతు చందన(25)ను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. రమణ సినిమా నిర్మాత బండ్ల గణేష్ వద్ద డ్రైవర్ పనిచేస్తుండగా, చందన ఓ ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. వీరిద్దరూ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్‌లోని అపార్టుమెంట్‍లో నివాసం ఉంటున్నారు.
సోమవారం మధ్యాహ్నం రమణ భోజనం చేసి విధులకు వెళ్లాడు. చందన ఇంటి నుంచే ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పి ఫోన్ కట్ చేసింది. దీంతో కంగారుపడిన రమణ హుటాహుటిన ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి, తాను కూడా డ్యూటీ నుంచి ఇంటికి బయలుదేరాడు.
అయితే, యజమాని ఇంటికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకీ తలుపులు తెరుచుకోలేదు. దీంతో కిటికీలోంచి చూడగా చందన ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూడగా అప్పటికే చందన చనిపోయినట్టు గుర్తించారు. మృతురాలి తండ్రి కోటేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.