చెన్నై నగర శివారు ప్రాంతమైన అయ్యపాక్కం కాల్సెంటరులో పనిచేస్తున్న ఆంధ్రాకు చెందిన యువకుడిని పెళ్ళి పేరుతో మోసగించి రూ.9 లక్షలు వసూలు చేసిన బెంగుళూరుకు చెందిన యువతిని క్రైం విభాగం పోలీసులు అరెస్టు చేశారు. అయ్యపాక్కం కాల్ సెంటర్లో అశోక్ చైతన్య (39) అనే యువకుడు ఓ మేట్రిమోనీ సంస్థలో పేరు నమోదు చేసి వధువు కోసం అన్వేషిస్తూ వచ్చాడు. ఆ మేట్రిమోని మెయిల్ ద్వారా మదనపల్లెకు చెందిన శ్రావణ సంధ్య అనే యువతి పరిచయమైంది.
యువతి తన వాస్తవ ఫొటోలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో పంపకుండా ఓ అందమైన మోడల్ ఫొటోలను అప్లోడ్ చేసింది. వాటిని చూసిన అశోక్ చైతన్య ఆమె అందాలకు ముగ్ధుడై చాటింగ్ చేయసాగాడు. ఆ సందర్భంగా ఆమె అవసరాలకు అడిగినంత సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేస్తూ వచ్చాడు. ఇటీవల ఓ విలువైన మొబైల్ ఫోనును కూడా ఆమెకు పార్శిల్లో పంపాడు. ఇలా ఆశోక్ చైతన్య ఆ యువతికి రూ.లక్షల దాకా ముట్టజెప్పాడు. చివరకు ఇద్దరం పెళ్ళి చేసుకుందామని ప్రతిపాదన పెట్టగానే ఆ యువతి ఖంగుతింది. క్రమంగా అతడితో చాటింగ్ చేయడం మానేసింది.
తన ఫోనులో అశోక చైతన్య నెంబరును బ్లాక్ చేసింది. చివరకు తాను మోసపోయానని గ్రహించిన అశోక్ చైతన్య... క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఇరువురి సెల్ఫోన్ నంబర్లు, ఇన్స్టా గ్రామ్, ఫేస్బుక్ చాటింగ్ ఆధారంగా బెంగళూరులో ఉన్న శ్రావణ సంధ్యను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో ఆమె పలువురు యువకులను పెళ్ళి చేసుకుంటానని ఆశజూపి లక్షలాది రూపాయలను మోసగించిందని పోలీసుల విచారణలో వెల్లడైంది.