"మైనింగ్ డాన్" గాలి సంపద ఎంతని చెప్పాలి..? ఏమని చెప్పాలి..?!!

బుధవారం, 7 సెప్టెంబరు 2011 (22:03 IST)
FILE
గాలి సంపదను చూస్తున్న దర్యాప్తు అధికారులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారట. వెనుకటికి ఎన్టీఆర్ గజదొంగ సినిమాలో నీ ఇల్లు బంగారం కానూ.. అని పాట పాడినట్లు గాలి ఇంట్లో ఎక్కడ చూసినా అంతా బంగారమయంగా ఉన్నదట. గాలి ఆశీనుడయ్యేందుకు బంగారు సింహాసనం, ఆకలేస్తే భుజించేందుకు బంగారు కంచం, టిఫిన్ చేయాలనిపిస్తే తినేందుకు గోల్డెన్ స్పూన్, బయటకు బయలుదేరేటపుడు నడుముకు ధరించేందుకు గోల్డెన్ బెల్ట్.. ఇలా ఒకటేమిటి ఇంటి నిండా అంతా బంగారుమయం.

ఇక లెక్కల్లోకి వస్తే గాలి తయారు చేయించిన బంగారు సింహాసనం ఖరీదు హీనపక్షంగా రెండున్నర కోట్ల రూపాయలు దాకా ఉంటుందని అంచనా. తనకు బంగారు కుర్చీ, బెల్టు, ఆభరణాలు ఉన్నాయని గాలి స్వయంగా లోకాయుక్తకు ఇచ్చిన 9 పేజీల్లో సమర్పించారు.

అసలు ఇంతటి ధనాగారాన్ని సొంతం చేసుకున్న గాలి జనార్థన్ రెడ్డి చరిత్రను ఒక్కసారి తిరగేస్తే... 1998లో ఓ ఫైనాన్స్ కంపెనీ పెట్టి ఆనక 20 కోట్ల రూపాయల మేర జనం నెత్తిపై టోపీ పెట్టాడన్న ఆరోపణలను ఆనాడే ఎదుర్కొన్నాడు గాలి. అనంతరం బిషానా ఎత్తేసిన గాలి రాజకీయ నాయకుని అవతారం ఎత్తాడు. సరిగ్గా 2008లో తన ఆస్తుల సుమారు 115 కోట్ల రూపాయల దాకా ఉంటాయని వెల్లడించాడు.

గాలి గనుల వ్యాపారంతో ఇంతింతై వటుడింతై అన్నట్లు తన సామ్రాజ్యాన్ని దశదిశలా వ్యాపింపజేశాడు. కోట్లకు కోట్లు డబ్బు వచ్చి పడుతుండటంతో లగ్జరీ లైఫ్ ఎలా ఉండాలో చూపించాడు. ఖరీదైన విదేశీ కార్లు ఏవైనా మార్కెట్లోకి వస్తే అది గాలి గ్యారేజీలో ఉండాల్సిందే. ఇక అత్యాధునిక హెలికాఫ్టర్లు కొనుగోలు చేయగల సమర్థత బహుశా మన దేశంలో ఎంతమందికి ఉన్నదో తెలియదు కానీ గాలి మాత్రం రెండు హెలికాఫ్టర్లను కొనుగోలు చేసేశారు.

ఇంతేనా.. అంటే ఇంకా చాలా ఉంది. ఇంట్లో ఫర్నీచర్ అంతా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే. సూపర్ టెలివిజన్, ఇంట్లో ఉన్న ఆకర్షణీయమైన బంగారు ఆభరణాలను ఎంత చూసినా చూడాలనిపించేట్లుగా ఉన్నాయట. ఇక ఎవరైనా అపరిచితులు ఇంటిని సమీపిస్తే వారిని ఇట్టే పసిగట్టేందుకు ఇంటి చుట్టూ నిఘా కేమెరాలను అమర్చుకున్నారు గాలి.

ఇక తనలో ఉన్న ఆధ్యాత్మిక భావాలను, భక్తిని చాటుకునేందుకు శ్రీ వేంకటేశ్వర స్వామికి 2009లో 42 కోట్ల రూపాయల విలువ చేసే కిరీటాన్ని సమర్పించారు. అంతేకాదు అదే ఏడాదిలో తన ఇంట్లోఅంగరంగ వైభవంగా జరిపించిన పెళ్లికి ఎకాఎకిన 20 కోట్ల రూపాయల ఖర్చు పెట్టారంటే ఆయన సంపద ఎంత మేరకు మేటలు వేసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.

గాలి సంపద ఒకప్పుడు 1000 కోట్లు అని ప్రచారం జరిగింది... కానీ ఇప్పుడది వందల రెట్లు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గాలిని నిద్ర మంచం మీదే అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న కీలక పత్రాలు, ల్యాప్‌టాప్‌లో ఉన్న సమాచారాన్ని విశ్లేషించే పనిలో పడ్డారు. మరోవైపు అపారమైన సంపదకు సంబంధించిన వివరాలను ఐటీ శాఖకు సమర్పించింది సీబీఐ. ఇక ఇప్పుడు ఆదాయ వివరాల లెక్కల పనిబట్టేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. ఐటీ తవ్వకాల్లో ఇంకా ఎన్ని కోట్ల గాలి సంపద బయటపడుతుందో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి