మాట వినకుంటే బర్తరఫ్... : కమలనాథుల కనుసన్నల్లో తమిళనాడు రాజకీయాలు..?!

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:58 IST)
రాష్ట్రపతి ఎన్నికలకు ముందు తమిళనాడులోని అధికార అన్నాడీఎంకే రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నిన్నామొన్నటివరకు ఇటు పార్టీని, అటు ప్రభుత్వాన్ని శాసిస్తూ వచ్చిన శశికళ, టీటీవీ దినకరన్ ఇపుడు ఏకంగా పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రపతి ఎన్నికలకు ముందే తమిళనాడు సర్కారును బర్తరఫ్ చేయాలని కమలనాథులు భావించారు. అయితే, అన్నాడీఎంకే రెండాకుల గుర్తు కోసం ఆ పార్టీ ఉ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ ఏకంగా రూ.50 కోట్ల లంచం ఎన్నికల సంఘానికే ఇవ్వజూపినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనపై ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఆయనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉంది.
 
దినకరన్ వ్యవహారాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న బీజేపీ నేతలు.. పన్నీర్ సెల్వంతో పావులు కదిపింది. ఆ తర్వాతే అన్నాడీఎంకేలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. అన్నాడీఎంకే వైరి వర్గాలు ఒకటిగా కలిసిపోయేందుకు సమ్మతించాయి. ఇందుకోసం సోమవారం రాత్రంతా చర్చలు జరిపాయి. ఈ చర్చలకు కేంద్ర లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురైతో పాటు పలువురు మంత్రులు సయోధ్యులుగా వ్యవహరించారు. 
 
అయితే, ఈ తాజా పరిణామాలన్నీ బీజేపీ కనుసన్నల్లో, ఆ పార్టీ పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయని విశ్లేషకులు వివరిస్తున్నారు. నిజానికి, శశికళపై తిరుగు బావుటా ఎగుర వేసిన ఓపీఎస్‌.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది ఆఖరుకు తన వర్గాన్ని బీజేపీలో విలీనం చేయాల్సి ఉంది. లేకపోతే బీజేపీకి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సమానంగా సీట్లు ఇవ్వాలన్నది ముందస్తు ఒప్పందమని చెబుతున్నారు.
 
అయితే తర్వాత ఓపీఎస్‌ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీలో విలీనం చేసినా, ఆ పార్టీతో కలిసి సాగినా మునుముందు తన వెంట ఉన్న నేతలు జారిపోవడం ఖాయమని ఆయనకు బోధపడింది. దీంతో విలీనం ప్రతిపాదనపై చర్చిస్తున్నారని అంటున్నారు. అయితే అన్నాడీఎంకే నేతలంతా ఏకమైన తర్వాత బీజేపీతో కలిసి సాగాలన్న ఒప్పందంతోనే ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. బీజేపీ సూచనల మేరకే శశికళ, దినకరనలను పక్కనబెట్టేందుకు రంగం సిద్ధమైందని స్పష్టం చేశాయి. 

వెబ్దునియా పై చదవండి