లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రాజకీయాలకు ప్యాకప్ చెప్పాలని ఆలోచిస్తున్నారా? పూర్తి సమయం సినిమాలకే కేటాయించాలనుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం రాబోతుంది. ఎన్నికల సమయంలో స్టార్ క్యాంపెయినర్‌గా కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ అంతటా ప్రచారం చేసినా, కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా ప్రకటనలు విడుదల చేయడం తప్ప పెద్దగా క్రీయాశీల రాజకీయాల్లో కనిపించడంలేదు.
విజయశాంతి పొలిటికల్ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలిస్తే రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగారు. భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న విజయశాంతి కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి టీఆర్ఎస్లో విలీనం చేశారు. ఆ తరువాత మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొంది లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తరువాత కేసీఆర్‌తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా టీఆర్ఎస్కు సైతం గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడామె కాంగ్రెస్‌లోనే ఉన్నా, క్రియాశీలకంగా మాత్రం లేరు.
కాంగ్రెస్‌లో సీనియర్లు తనను పొమ్మనలేక పొగపెడుతున్నారని అసంతృప్తిగా ఉన్న రాములమ్మను సొంతపార్టీ గూటికి తీసుకురావడానికి బిజేపి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఈ ప్రచారాన్ని విజయశాంతి చాలాసార్లు ఖండించారు. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేవు కాబట్టి, ఆమె సినిమాలను ఒప్పుకున్నారని, త్వరలో మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలకం అవుతారని పొన్నం ప్రభాకర్ లాంటి నేతలు అంటున్నా, విజయశాంతి మనస్తత్వం తెలిసిన నేతలు ఆమె రాజకీయాల్లో ఇమడలేరని అందుకే మరలా సినిమాలు వైపు వస్తున్నారని అంటున్నారు.