ఏపీలో రాజకీయం భిన్నంగా నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ వైసీపీ ఎంపీలు బీజేపీ టచ్లో ఉన్నారనే ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది. దీనికి ఎంపీ సుజనాచౌదరి మాటలు ఆజ్యం పోశాయి. దీంతో వైసీపీ భగ్గుమంది. ఏపీలో ప్రభుత్వం మారిన ఆరునెలలకే వలసల రాజకీయం ఎందుకు హైలెట్ అవుతోందనే ప్రశ్న అందరిలో మెదలుతోంది.
అంతలా విజయం సాధించిన తర్వాత ఆ పార్టీ నేతలు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అది కూడా ఆరునెలల్లో అంటే ఏదో తేడా జరుగుతోందనే లెక్క. అందుకు సుజనా మాటలు ఒక్కసారిగా ప్రకంపనలు రేపాయి. ఆ ప్రకంపనలు సుజనాపై మాటల తూటాల రూపంలో బయటకు వచ్చాయి. రోజంతా వైసీపీ ఎంపీలు, సుజనాపై ముకుమ్మడి దాడి చేశారు.
ఎంపీల మీడియా సమావేశానికి కొంతమంది ఎంపీలు రాలేదు. అలాగే రెండు రోజుల కిందట ఎంపీ విజయసాయిరెడ్డితో జరిగిన సమావేశానికి కొంతమంది డుమ్మా కొట్టారు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఎంపీలు కానీ మంత్రులు, ఇతర నేతలు సుజనాపై విమర్శల్లో ఓ స్పష్టమైన అడ్డుగీత గీసుకున్నారు.