ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: ఒత్తిడిలో వున్నవారిలో 5 లక్షణాలు
శనివారం, 10 అక్టోబరు 2020 (22:52 IST)
మానసిక అనారోగ్యంతో కొట్టుమిట్టాడేవారు ఎప్పుడు ఏం చేస్తారో తెలియకుండా వుంటారు. మానసిక ఆరోగ్యం సరిగా లేనివారిలో ఐదు హెచ్చరిక సంకేతాలు కనబడతాయి. మొదటిది దీర్ఘకాలిక విచారం లేదా చిరాకు. రెండోది చాలా ఎక్కువ మరియు తక్కువ మనోభావాలు చూపిస్తుంటారు.
మూడోది అధిక భయం, ఆందోళనతో కనబడుతుంటారు. నాలుగవది సామాజిక ఉపసంహరణ, సమాజంతో పట్టనట్లు కనబడుతారు. ఐదవది తినడం లేదా నిద్రించే అలవాట్లలో నాటకీయ మార్పులు. ఈ లక్షణాలను కలిగి వున్నారంటే వారు మానసిక ఒత్తిడితో సమతమతమవుతున్నట్లే లెక్క.
ఇకపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తం కోవిడ్-19 కారణంగా ఎన్నడూ ఎదుర్కొనని గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 విపత్తు గురించి, మరణాలు గురించి టివిలలో మరియు వివిధ సమాచార మాధ్యమాలలో వచ్చే సమాచారాన్ని చూసి భయాందోళనకు గురవడమే కాకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల వలన ప్రజలు బయటకు రాలేని పరిస్థితులు ఏర్పడి ఎక్కువ సమయం ఇంట్లోనే ఉండిపోవడం వల్ల మానసిక ఒత్తిడి మరియు కుంగుబాటుకు గురవుతారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది ప్రజల్లో గమనించే లక్షణాలు:
ఆందోళనగా కనిపించడం, ఒళ్ళంతా చెమట పట్టడం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది, నోరు పొడిబారినట్లు అవడం, గుండెదడ వంటి లక్షణాలతో పాటు మానసిక ఒత్తిడి, అధికంగా ఆందోళన చెందడం, ఏ పనిమీద సరిగా దృష్టి పెట్టలేకపోవడం, ఆసక్తి చూపకపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు.
పరిష్కార మార్గాలు:
- మానసిక ఒత్తిడికి గురైనపుడు మనకు లభించిన సమయాన్ని సరైన కార్యక్రమాలు ఎంచుకోవడంతో పాటు సానుకూల దృక్పథం గల ఆలోచనలు చేస్త్తూ సరైన రీతిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనగా టివిలలో మానసిక ఉల్లాసం కలిగించేటువంటి కార్యక్రమాలు చూడడం
- ఆహ్లాదానిచ్చే సినిమాలు చూడడం, ఇంట్లోనే ఉంటూ బంధువులు మరియు స్నేహితులతో మాట్లాడడం, పజిల్స్ సాధించడం, స్టోరీబుక్స్ చదవుతూ ఉండాలి. అంతేకాకుండా ఒత్తిడిని అధిగమించడానికి, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవడానికి వ్యాయామం, యోగా చేయడమే కాకుండా మంచి నిద్రతో సరైన విశ్రాంతి తీసుకోవాలి
మనిషి ఉల్లాసంగా ఉండడానికి ఈ క్రింది హార్మోన్లు ఎంతగానో ఉపయోగడతాయి. ఈహార్మోన్లు మనందరి శరీరంలో ఉంటాయి. వాటిని ఉత్తేజపరచడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉల్లాసవంతంగా ఉండవచ్చు.
మనలో ఆనందాన్ని నిర్ణయించే హార్మోనులు నాలుగు:
1. ఎండార్ఫిన్స్ (Endorphins)
2. డోపామైన్ (Dopamine)
3. సెరిటోనిన్ (Serotonin)
4. ఆక్సిటోసిన్ (Oxytocin)
ఈ నాలుగు హార్మోనుల గురించి మనం తెలుసుకుంటే మన జీవితాన్ని ఆనందదాయకంగా మార్చుకోగలం.
1. ఎండార్ఫిన్స్ (Endorphins):
- మనం ఏదైనా వ్యాయామం చేసినపుడు ఎండార్ఫిన్ హార్మోన్ విడుదల అవుతుంది. ఈ ఎండార్ఫిన్స్ మన శరీరంలో వ్యాయామం వలన కలిగే నొప్పులను భరించే శక్తిని ఇస్తాయి.
- నవ్వడం వలన కూడా ఈ ఎండార్ఫిన్ ఎక్కువగా విడదల అవుతాయి.
- ప్రతిరోజూ 30 నిముషాల వ్యాయామం చేస్తూ, చక్కటి హాస్య భరిత జోకులు చదువుతూ ఉండండి
2. డోపామైన్ (Dopamine):
- నిత్య జీవితంలో ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాము. ఇవి వివిధ స్థాయిలలో మనలో డోపామైన్ హార్మోను ను విడుదల చేస్తాయి. దీని స్థాయిని పెంచుకోవడం వలన మనం ఆనందంగా ఉంటాము.
- ఇంట్లో చేసిన వంటను మెచ్చుకోవడం వలన వంట చేసిన వారిలో డోపామైన్ స్థాయిని మీరు పెంచగలరు
ఆఫీస్ లో బాస్ మీ పనిని మెచ్చుకుంటే మీలో డోపామైన్ స్థాయి పెరుగుతుంది.
- అలాగే కొత్త బైక్/కార్ కొన్నప్పుడు, కొత్త చీర కొనుక్కున్నప్పుడు, కొత్త నగ చేయించినప్పుడు, షాపింగ్ కి వెళ్ళినపుడు మీరు సంతోషంగా ఉండడానికి కారణం ఈ డోపామైన్ విడుదల కావడమే.
3. సెరిటోనిన్ (Serotonin):
- ఇతరులకు సాయం చేసినపుడు, వారికి మేలు చేసినపుడు ఈ సెరిటోనిన్ హార్మోన్ విడుదల అవుతుంది
- మన స్నేహితులకు ఏదైనా మంచి పని చేసినపుడు మనలో సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది.
- ఇందుకు మనం ఏమేమి పనులు చెయ్యవచ్చు?
- స్నేహితుల ఇళ్ళకు వెడుతూ ఉండడం, మొక్కలు నాటడం, రోడ్ల గుంతలు పూడ్చడం, రక్త దానం, అనాధ సేవ, యువతకు స్ఫూర్తి కలిగించే కార్యక్రమాలు చేయడం.
- మంచి విషయాలు సోషల్ మీడియాలో, బ్లాగ్స్ లో పోస్ట్ చెయ్యడం
ఇలా మన సమయాన్ని, మన జ్ఞానాన్ని పంచుతున్నాం కాబట్టి మనలో సెరిటోనిన్ విడుదల అవుతుంది.
4. ఆక్సిటోసిన్ (Oxytocin):
- మరపురాని సంఘటనలను గుర్తుచేసుకున్నపుడు, అలాగే మీ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నప్పుడు ఆక్సిటోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది.
మానసిక కుంగుబాటుకు గురయినపుడు:
- మనిషి మానసికంగా కుంగుబాటుకు గురైనపుడు దాన్ని అధిగమించడంతోపాటు బలంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
- వ్యాయామాలు చేయడం, ఇంట్లో వారికి పనుల్లో సాయం చేయడం, కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడడం, కుటుంబసభ్యులతో కలసి ఉండడం చేస్తూ ఉండాలి.
- మరీ ఎక్కువ ఒత్తిడికి గురైనపుడు గదిలో ఒంటరిగా ఉండకూడదు. అలాగే ఇలాంటి సందర్బాలు ఎదురైనపుడు సొంత వైద్యం చేసుకుని ఇబ్బంది పడకుండా అందుబాటులో ఉన్న సరైన వైద్యున్ని సంప్రదించి తగిన సహాయం పొందాలి.
వైరస్ పైన పోరాటంలో ప్రభుత్వం తీసుకునే కొన్ని కఠిన చర్యల వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూనే పైన చెప్పిన సూచనలు పాటిస్తూ ప్రజలు మానసిక ఒత్తిడికి, కుంగుబాటుకు గురవకుండా ఉండవచ్చు.