"హర్యానా హరికేన్" తొలి శతకం నమోదైన రోజు

"హర్యానా హరికేన్" అనే ముద్దు పేరుతో క్రీడాభిమానులందరూ పిలుచుకునే కపిల్ దేవ్... భారత క్రికెట్ జట్టుకు ఎనలేని సేవలందించి దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నత ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా పేరుసంపాదించాడు. 1983 జూన్ 18న జింబాబ్వే జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 175 పరుగుల వ్యక్తిగత స్కోరును సాధించిన కపిల్... భారత్ తరపున తొలి శతకాన్ని నమోదు చేయడమే చరిత్రలో జూన్ 18వ తేదీ ప్రత్యేకత.

పాకిస్థాన్‌లోని రావల్పిండి సమీపంలో గల ఒక గ్రామంలో రాంలాల్ నిఖంజ్, రాజ్ కుమారీ అనే దంపతులకు 1959, జనవరి 6వ తేదీన జన్మించాడు కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్. దేశ విభజన సమయంలో భారత్‌కు తరలివచ్చిన కపిల్ కుటుంబం చండీగర్ స్థిరపడింది. స్థానిక్ డీ.ఏ.వీ. కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ 1971లో దేశ్ ప్రేమ్ ఆజాద్ శిష్యుడిగా చేరువయ్యాడు.

దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టిన కపిల్... 1975 నవంబర్‌లో హర్యానా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, పంజాబ్‌పై తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. 1976-77 సీజన్‌లో జమ్ము కాశ్మీర్ పై ఓపెనింగ్ బౌలర్‌గా రాణించిన ఆయన 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు.
రికార్డుల్లో కూడా తనకు తానే సాటి..!
  1988లో జోయెల్ గార్నల్ రికార్డును అధిగమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత 1994లో పాకిస్తాన్ కు చెందిన వసీం అక్రం ఈ రికార్డును చేధించాడు. వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా కూడా స్థానం ఈయనదే...!      


1977-78 సీజన్‌లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి కపిల్ దేవ్ మరోసారి తన ప్రతిభను చాటిచెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనే 3 వికెట్లు సాధించి ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనతను తొలిసారిగా పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. తదనంతరం ఇదే ఘనతను టెస్ట్ క్రికెట్‌లో కూడా రెండుసార్లు సాధించాడు.

1978-79 సీజన్‌లోనూ కపిల్ అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందటమేగాక, బ్యాటింగ్‌లో కూడా రెండూ అర్థశతకాలను సాధించాడు. ఆపై ఇరానీ ట్రోఫిలో 8వ నెంబర్ బ్యాట్స్‌మెన్‌గా క్రీజులో ప్రవేశించి 62 పరుగులు చేశాడు. దులీప్ ట్రోఫిలో 24 ఓవర్లలో 65 పరుగులకు 7 వికెట్లు సాధించి జాతీయ దృష్టిని ఆకర్షించాడు. దేవధర్ ట్రోఫీ, విల్స్ ట్రోఫీలలో నార్త్ జోన్ తరపున ఆయన తొలిసారిగా ప్రాతినిద్యం వహించాడు. ఇదే సీజన్‌లో కపిల్ పాకిస్తాన్‌పై తొలి టెస్ట్‌మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.

కపిల్ టెస్ట్ క్రీడా జీవితానికి వస్తే... 1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్‌పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. కరాచిలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి భారత్ తరపున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు. ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు.

హర్యానా హరికేన్ రికార్డుల విషయాన్ని పరిశీలిస్తే... 1994, జనవరి 30న శ్రీలంకపై బెంగుళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు చెందిన రిచర్డ్ హాడ్లీ రికార్డును అధిగమించి టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించినాడు. టెస్ట్ క్రికెట్‌లో 4000 పరుగులు మరియు 400 వికెట్లు డబుల్ ఫీట్ సాధించిన తొలి ఆల్‌రౌండర్‌గా రికార్డు సృష్టించాడు.

అలాగే... 1988లో జోయెల్ గార్నల్ రికార్డును అధిగమించి వన్డేలలో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. తరువాత 1994లో పాకిస్తాన్ కు చెందిన వసీం అక్రం ఈ రికార్డును చేధించాడు. వన్డేలలో సెంచరీ సాధించిన మొట్టమొదటి భారతీయుడు. లార్డ్స్ మైదానంలో వరుసగా 4 సిక్సర్లు కొట్టి ఈ ఘనత పొందిన తొలి బ్యాట్స్‌మెన్‌గా అవతరించాడు.

2002లో విజ్డెన్ పత్రికచే 20వ శతాబ్దపు మేటి భారతీయ క్రికెటర్‌గా కూడా కపిల్ దేవ్ గుర్తింపు పొందాడు. ఇతను సారథ్యం వహించిన ఏకైక ప్రపంచకప్ (1983) టోర్నీలో భారత్‌ను విశ్వవిజేతగా తీర్చిదిద్దాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమించే నాటికి అత్యధిక టెస్ట్ వికెట్లు సాధించిన బౌలర్‌గా కూడా ఈయన రికార్డు సృష్టించాడు. 1999 అక్టోబర్ నుంచి 2000 ఆగష్టు వరకు 10 మాసాల పాటు భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు.

కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్‌గా చలామణి అయ్యాడు. 1980లలో ఇన్‌స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్‌మెన్‌లను గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. బ్యాట్స్‌మెన్‌గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు.

జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు తన విలక్షణమైన బ్యాటింగ్‌ శైలితో విరుచుకుపడి ప్రత్యర్థులను బెంబేలెత్తించేవాడు కపిల్. ఇలా భారత క్రికెట్ అమ్ములపొదిలోకి చిరస్మరణీయమైన విజయాలను సమకూర్చిన కపిల్ దేవ్ క్రీడాజీవితం, క్రీడాస్ఫూర్తి... నేటి యువ క్రికెటర్లకు ఆదర్శప్రాయం అనడంలో ఎలాంటి సందేహమూ లేదు.

వెబ్దునియా పై చదవండి