ఎండలో వెళ్లిన ప్రతిసారీ తలకు టోపీ తప్పనిసరి. హెల్మెట్ పెట్టుకునే వాళ్లు ముందు నీళ్లతో తడిపిన రుమాలు తలకు, ముఖానికి కట్టుకుని తర్వాత హెల్మెట్ పెట్టుకోవాలి. ఎండలో పనిచేసేవాళ్లు గంటకు లీటరు చొప్పున నీరు తాగాలి. ఇంటిపట్టున ఉండేవారు రోజుకి 4 లీటర్ల నీరు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
నీరు ఉండే పుచ్చ, ద్రాక్ష, దోసకాయలను తినాలి. చెమట ద్వారా కోల్పోయే ఖనిజ లవణాలను భర్తీ చేయడం కోసం ఎలకా్ట్రల్, కొబ్బరి నీరు తాగాలి. ఉప్పు, పంచదార కలిపిన నీరు కూడా మేలు చేస్తుంది. ఎండలో ఎక్కువ సమయం ప్రయాణం చేయవలసివస్తే రెండు గంటలకోసారి ఆగి, నీడ పట్టున విశ్రాంతి తీసుకోవాలి.
ఇంకా వేడి వాతావరణానికి గురైనా ఎండదెబ్బ తగులుతుంది. వంటగదిలో పొయ్యి దగ్గర ఎక్కువ సమయం గడిపే స్త్రీలు, కొలిమి దగ్గర పనిచేసేవాళ్లు, రేకుల ఇంట్లో నివసించేవాళ్లు, వేడి గాలికి గురయ్యేవాళ్లకు కూడా ఎండ దెబ్బ తగులుతుంది. అలాగే విపరీతంగా వ్యాయామం చేసేవాళ్లు కూడా వేసవిలో ఎండదెబ్బకు గురవుతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.