చేపలు తినటం మంచిదని పోషకాహార నిపుణులు చెప్తారు. చేపలు పొట్ట, రక్తపోటు పెరగకుండా చేస్తాయి. గుండెజబ్బులు, మధుమేహం, పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు దోహదం చేస్తాయి. చేపలు తరచుగా తినేవారికి పెద్దపేగు, మలద్వార క్యాన్సర్ల ముప్పూ తగ్గుతున్నట్టు తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.
చేపలు తినేవారిలో క్యాన్సర్లతో మరణించే అవకాశం కూడా 12% తగ్గుతుండటం గమనార్హం. వయసు, మద్యం అలవాటు, మాంసం తినటం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర వంటి ముప్పు కారకాలను పరిగణలోకి తీసుకొని పరిశీలించినా చేపలతో మేలు జరుగుతున్నట్టు బయటపడింది. చేపల్లోని ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో ఈ ప్రయోజనాలు కలుగుతున్నాయని భావిస్తున్నారు.