కిటకిటలాడుతున్న గోదావరి పుష్కరాలు.. స్నాన ఘట్టాలకు పోటెత్తిన భక్తులు

శనివారం, 18 జులై 2015 (09:59 IST)
గోదావరి పుష్కరాలు ఐదో రోజున స్నాన ఘట్టాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జామున 2 గంటల నుంచే పుణ్యస్నానాలు ఆచరించడానికి భక్తులు పుష్కర ఘాట్‌లకు చేరుకోవడంతో అన్ని ప్రాంతాల్లో భారీ రద్దీ ఏర్పడింది. తెలుగు రాష్ట్రాలలో పలు ప్రాంతాల నుంచి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ఘాట్లకు భక్తులు పోటెత్తతున్నారు. 
 
పుష్కరాల కోసం హైదరాబాద్‌ నుంచి భక్తులు భారీగా తరలివస్తుండడంతో రహదారులు క్కిరిసిపోతున్నాయి. కీసర, గట్టు భీమవరం టోల్‌గేట్ల దగ్గర  వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. విజయవాడ జంక్షన్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసేందుకు చర్యలు చేపట్టారు. 
 
మరోవైపు వరుస సెలవులు కావడంతో పుష్కరఘాట్లకు పిల్లాపాపలతో చేరుకుంటున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి మొక్కులు తీర్చుకుంటున్నారు. రాజమండ్రిలో భక్తులతో రోడ్లన్ని జనసంద్రం అయ్యాయి. అంతర్వేది పుణ్యక్షేత్రంలో భక్తులు బారులు తీరారు. అలాగే గోష్పాద ఘాట్, కోటి లింగాల ఘాట్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.

వెబ్దునియా పై చదవండి