చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ యుద్ధానికి పిలుపునిచ్చారు. ఒకవైపు ఉత్తర కొరియా వరుస అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచాన్ని కుదేలు చేస్తోంది. మరోవైపు పాకిస్థాన్‌కు చైనా పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనా అధినేత యుద్ధానికి సిద్ధం కావాలంటూ దేశ ఆర్మీకి పిలుపునివ్వడం ఇపుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
ముఖ్యంగా, "ఏ క్షణంలో అయినా యుద్ధం జరిగేందుకు అవకాశం ఉంది... సైన్యం సమరాన్ని ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉండాలి" అంటూ ఆయన పిలుపునిచ్చారు. సెంటల్ర్ మిలటరీ కమిషన్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిన్‌పింగ్.. సెంట్రల్ మిలటరీ కమిషన్ (సీఎంసీ) సమావేశంలో సైనికాధికారులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం సీఎంసీ సమావేశం జరిగినట్లుగా చైనా మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సమావేశంలోనే జిన్‌పింగ్ ప్రసంగిస్తూ సాయుధ బలగాలు.. యుద్ధానికి సిద్ధంగా ఉండాలని, గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డి పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చైనాను కొత్త శకంలోకి నడిపించేందుకు కొత్తమిషన్‌ను ప్రారంభించాలని జిన్‌పింగ్ సైన్యానికి స్పష్టం చేసినట్టు ఆ దేశ అధికారిక వార్తా సంస్థ జిన్హువా న్యూస్ ఏజన్సీ తెలిపింది.
కాగా, చైనాకు 28 లక్షల మంది సైనికులు ఉండగా, ప్రపంచంలోని అతిపెద్ద ఆర్మీ చైనాదే కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో యుద్ధానికి సిద్ధంగా ఉండాలని జిన్‌పింగ్ వ్యాఖ్యానించడం ఇది రెండోసారి. గత నెల 24వ తేదీన బీజింగ్‌లోనూ జిన్‌పింగ్ ఇవే వ్యాఖ్యలు చేశారు.