ఉగ్రవాదాన్ని పోత్సహిస్తున్న ఇరాన్‌కు విమానంలో 400 మిలియన్ డాలర్ల నగదు పంపించడం ఉగ్రవాద దేశాలతో ఒబామా ప్రభుత్వం కుమ్మక్కైందనడానికి నిదర్శనమని అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారవర్గం విమర్శించింది. ఇరాన్‌లో బందీలుగా ఉన్న నలుగురు అమెరికన్లను విడిపించడానికే ఒబామా సర్కారు ఈ డబ్బు పంపించిందని ఆరోపించింది.
మరోవైపు... అమెరికా అధ్యక్ష బరిలో తలపడుతున్న ట్రంప్, హిల్లరీ మధ్య విమర్శలు తూటాలుగా పేలుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తాజాగా డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ వ్యవస్థాపకురాలు హిల్లరీ క్లింటనేనని ఆరోపించారు.