విమానంలో ప్రయాణించే సమయంలో విమాన సిబ్బంది ఇచ్చిన చికెన్ సలాడ్‌లో బొద్దింక కనిపించింది. దీంతో ఆగ్రహించిన ఆ ప్రయాణికుడు ఆ విమాన సంస్థ నుంచి ఏకంగా రూ.87 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ముంబైకి చెందిన యూసఫ్ ఇక్బాల్ అనే వ్యక్తి గత 17 ఏళ్లుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ, లండన్‌కు చెందిన అంతర్జాతీయ కౌన్సిల్‌లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈయన ఫిబ్రవరి 27వ తేదీన తన భార్య, స్నేహితులతో కలిసి తన పుట్టినరోజు వేడుకులను ముంబైలో జరుపుకునేందుకు మొరాకో నుంచి ఎమిరేట్స్ సంస్థకు చెందిన విమానమెక్కాడు.
ఈ ఘటన కారణంగా తాను మానసికంగా, ఆర్థికంగా నష్టపోయానని అందుకుగాను తనకు రూ.87 లక్షలు నష్టపరిహారంగా చెల్లించాలని ఎమిరెట్స్ సంస్థకు లీగల్ నోటీసులు పంపించాడు. ఈ ఘటన కారణంగా వృత్తిపరంగా రూ.30 లక్షలు నష్టపోయానని, అనుభవించిన మానసిక వేదనకు రూ.50 లక్షలు, టికెట్ ఖర్చులు రూ.7 లక్షలతో కలిపి మొత్తం రూ.87 లక్షలు చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నాడు.
ఈ నోటీసులపై ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ ప్రతినిధులు వెరైటీగా స్పందించారు. మొరాకోలో ఈ సీజన్‌లో ఇటువంటి కీటకాలు సాధారణంగా కనిపిస్తాయని, ఆ బొద్దింక విమానంలోకి ఎలా వచ్చిందో అంతుచిక్కడం లేదని తెలిపారు. ఎయిర్ లైన్ ప్రతినిధులు ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని యూసఫ్ నష్టపరిహారాన్ని ఏప్రిల్ నెలలోపే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.