ముంబై మారణ హోమానికి సూత్రధారుడైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ విడుదలయ్యాడు. అతనిని విడుదల చేస్తూ పాకిస్థాన్‌లోని పంజాబ్ హైకోర్టుకు చెందిన జ్యూడీషియల్ రివ్యూ బోర్డు ఆదేశించింది. ఇన్నాళ్లు హౌస్ అరెస్ట్‌లో వున్న హఫీజ్ సయీద్‌ను విడుదల చేయవద్దని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని బోర్డు తిరస్కరించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతోనే అతనిని విడుదల చేయాల్సిందిగా బోర్డు పేర్కొంది.
కాగా.. సయీద్‌తో పాటు అతని అనుచరులు అబ్దుల్లా ఉబెయిద్, మాలిక్ జాఫర్ ఇక్బాల్, అబ్ధుల్ రెహ్మాన్, క్వాజీ కశిఫ్ హుస్సేన్‌లను పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న హౌస్ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద నిరోధక చట్టం 1997 కింద 90 రోజుల పాటు వీరికి గృహనిర్బంధం విధించింది. ఆపై రెండు సార్లు వారిపై గృహ నిర్భంధాన్ని పొడిగించింది.
గత నెల సయీద్ నిర్భంధాన్ని మరో 30 రోజులు పొడిగించింది. అయితే అక్టోబర్ చివరి వారంలో సయీద్ అనుచరులను విడుదల చేసిన బోర్డు హఫీజ్‌ను కూడా విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. అతనిపై చేసిన ఆరోపణలకు సంబంధించి సరైన సాక్షాధారాలను ప్రభుత్వం అందించలేకపోయిందని పేర్కొంది. సయీద్‌ను విడుదల చేస్తున్నట్టు తీర్పును వెలువరించింది.