డోనాల్డ్ ట్రంప్ ప్రచారంలో పశ్చిమగోదావరి జిల్లా వాసి... ఎవరు అతగాడు?

ఆదివారం, 6 నవంబరు 2016 (09:39 IST)
'మేక్‌ అమెరికా గ్రేట్‌ ఎగైన్' నినాదంతో అధ్యక్ష పదవి బరిలోకి దిగిన రిపబ్లికన్‌ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ చేస్తున్న ప్రచారంలో ఒక ఆంధ్రుడు కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో రిపబ్లికన్‌ పార్టీ ప్రచార కార్యక్రమాలకు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నాడు. అతడి పేరు.. అవినాశ్‌ ఇరగవరపు. వయసు 30 యేళ్లు. అతడు పుట్టిపెరిగిందంతా పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో. 
 
లఖ్‌నవ్‌ ఐఐఎం నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకున్న అవినాశ్‌.. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి.. 2014లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. నిజానికి.. ఎన్నికల ప్రచారం, వ్యూహాలపై అవినాశ్‌కు కాలేజీ రోజుల నుంచీ ఆసక్తి ఉంది. అదే ఇప్పుడు అతడిని ఈ స్థాయికి చేర్చింది. 
 
ఇదే అంశంపై అవినాశ్ మాట్లాడుతూ.. 'నా భార్య ఇక్కడ ఉన్న ఇంటెల్‌ సంస్థలో పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమెను కలిసేందుకు అమెరికా వచ్చాను. ఇక్కడ మేము నివశించే ఇంటి పక్కనే చాండ్లర్‌ సిటీ కౌన్సిల్‌కు త్వరలో ఎన్నికలు జరగబోతున్నట్టు తెలిపే సైన్‌ బోర్డును చూశా. 
 
ఆ తర్వాత ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో నిశితంగా పరిశీలించా. అరిజోనా గవర్నర్‌ ఎన్నికలు ఎలా జరుగుతాయో తెలుసుకున్నాను. ఎన్నికల ఫలితాల డేటాను విశ్లేషించి.. అరిజోనా గవర్నర్‌గా డౌగ్‌డూసీ గెలుస్తాడని ఊహించి అతడి ప్రచారకర్తలకు లేఖ రాశా. తన విశ్లేషణ నిజమైంది. డూసీ గెలుపొందారు. నా డేటా విశ్లేషణకు అరిజోనా రిపబ్లికన్‌ పార్టీ చైర్మన్‌ రాబర్ట్‌ గ్రాహం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఆ తర్వాత యేడాది వ్యవధిలోనే అరిజోనాలో పార్టీ డేటా డైరెక్టర్‌ పదవి నుంచి.. పొలిటికల్‌ డైరెక్టర్‌గా, తర్వాత ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా ఎదిగినట్టు చెప్పుకొచ్చాడు. 

వెబ్దునియా పై చదవండి