అమెరికా అధ్యక్ష ఎన్నికలు : కుంభస్థలాన్ని కొట్టిన డోనాల్డ్ ట్రంప్...

బుధవారం, 9 నవంబరు 2016 (12:31 IST)
అమెరికా అధ్యక్షుడు ఎవరో తేలిపోయింది. బరాక్ ఒబామా వారసునిగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎంపికయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం నుంచి సాగుతున్న ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ క్షణక్షణానికి ఉత్కంఠగా కొనసాగుతోంది. ఇప్పటివరకూ భారీ ఆధిక్యం కనబర్చిన ట్రంప్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నారు. 
 
ప్రతి ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ముఖ్య భూమిక పోషించే ఫ్లోరిడా రాష్ట్రంలో ట్రంప్ అనూహ్య విజయం హిల్లరీకి గట్టి షాకిచ్చింది. ఫ్లోరిడా అమెరికాలోని అతి పెద్ద రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ గెలుపొందిన వ్యక్తినే దాదాపు విజయం వరిస్తుందనే సెంటిమెంట్ ఉంది. ఇక్కడ గెలిస్తే కుంభస్థలాన్ని కొట్టినట్టేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఫ్లోరిడాతో పాటు పలు కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ జెండా రెపరెపలాడింది.
 
ఒహియోలో ట్రంప్‌ గెలుపు రిపబ్లికన్లలో ఆనందాన్ని నింపింది. ఒహియోలో ఎవరు గెలిస్తే వారే అధ్యక్షుడని సెంటిమెంట్ కూడా ఉండటంతో ట్రంప్ మద్ధతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు. తాజా లెక్కల ప్రకారం 210 స్థానాల్లో హిల్లరీ, 244 స్థానాల్లో ట్రంప్ గెలుపొందారు. విజయానికి 42 ఎలక్ట్రోల్‌ ఓట్ల దూరంలో ట్రంప్ ఉన్నట్లు తాజా సమాచారం. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాలను చూసుకుంటే 21 రాష్ట్రాల్లో ట్రంప్, 16 రాష్ట్రాల్లో హిల్లరీ గెలుపొందారు. దీంతో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ఆయనే ఎన్నికయ్యే అవకాశం ఉంది. 

వెబ్దునియా పై చదవండి