అల్లు రామలింగయ్య మనవడిగా, అల్లు అరవింద్ తనయుడిగా, మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా 'గంగోత్రి' సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన అల్లు అర్జున్ రెండో సినిమాతోనే స్టార్‌డమ్ స్వంతం చేసుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయి తన స్టార్‌డమ్‌ను సుస్థిరం చేసుకున్నారు.
అంతేకాదు, తెలుగులోనే కాకుండా వేరే భాషలో స్టార్ హోదా అనుభవిస్తున్న ఏకైక తెలుగు కథానాయకుడు అల్లు అర్జున్. మళయాళ చిత్రసీమలోని అగ్ర కథానాయకులకున్న క్రేజ్ అల్లు అర్జున్‌కు ఉంది. ఇటీవల కాలంలో ఒకటి రెండు చిత్రాలు అల్లు అర్జున్ అభిమానులకు కాస్తంత ఆశాభంగం కలిగించిన మాట వాస్తవమే అయినప్పటికీ అవి ఆయన కెరీర్‌ను ప్రభావితం చేసేంతటివి కాదు.
అల్లు అర్జున్ మార్చి 6న వివాహం చేసుకోబోతున్నారు. మరోవైపు వి.వి. వినాయక్ దర్శకత్వంలో తన తండ్రి నిర్మిస్తున్న 'బద్రినాథ్' షూటింగ్ కార్యక్రమాలు పూర్తి కావస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో జరిపిన ఇంటర్వ్యూ మీ కోసం....
"వరుడు" సినిమా తర్వాతే పెండ్లికళ వచ్చిందన్నారు...? అప్పుడు నాన్నగారు ఫంక్షన్‌లో సరదాగా... నాకు వధువును చూస్తున్నామన్నారు. ఇది ఈ రకంగా నెరవేరింది. దేనికైనా సమయం రావాలి.
బన్నీ, 'గంగోత్రి' నాటి అల్లు అర్జున్‌కు 'బద్రీనాథ్' అల్లు అర్జున్‌కు తేడా ఏమిటి? మార్పు అనేది అనివార్యం కదా? కాబట్టి నాలోనూ కచ్చితంగా మార్పు ఉంది. నేననే కాదు ప్రతి యాక్టర్ విషయంలోనూ ఈ మార్పు అనేది ఉంటుంది. మన ఫ్రీడమ్‌లో మార్పు వస్తుంది. మన ఆలోచనా విధానంలో తేడా చోటు చేసుకుంటుంది. అంతేకాదు, భావోద్వేగాల పరంగానూ మార్పనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఇప్పటి వరకు మీరు నటించిన సినిమాల్లో ఏ సినిమా క్యారెక్టర్‌తో మీ రియల్ లైఫ్ క్యారెక్టర్‌ను పోల్చుకోవచ్చంటారు? ఏ సినిమాలోనూ కాదు. నేను పెరిగిన వాతావరణానికి నా సినిమాల్లోని కథల వాతావరణానికి చాలా వ్యత్యాసం ఉంది. అయితే మా అమ్మ, ఆంటీ లేదా స్నేహలను మరీ ఎక్కువ విసిగించినప్పుడు మాత్రం ఫలానా సినిమాలో నేను చేసిన క్యారెక్టర్‌ను గుర్తుకు తెచ్చి చిన్నగా చీవాట్లు పెడుతుంటారు.
'బద్రీనాథ్' ఏం చేస్తాడు? 'బద్రీనాథ్' పీరియడ్ ఫిలిం అనే ఫాల్స్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అయిందో నాకైతే తెలియదు కానీ ఇది ఖచ్చితంగా ఆ తరహా చిత్రం కాదు. ఒక ఆలయం బ్యాక్‌డ్రాప్‌లో నడిచే ఇప్పటితరం కథే ఇది. నేను ఇందులో ఇండియన్ సమురాయ్‌గా నటిస్తున్నాను.
మరి కత్తులు, కటార్లు... మీ హెయిర్ స్టైల్? తుపాకులతో చేసే ఫైట్స్‌కంటే కత్తులు, గొడ్డళ్ళు వంటి పురాతన మారణాయుధాలతో చేసే ఫైట్స్ ఆడియన్స్‌ను ఎక్కువగా అలరిస్తాయి. ఒకవేళ తుపాకులు వాడినా, వాటిలో బుల్లెట్స్ అయిపోయినట్లుగా చూపించి, వేరే వెపన్స్‌తో ఫైట్స్ కంటిన్యూ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఈ సినిమాలో నేను పెంచిన లాంగ్ హెయిర్ అంటారా? అది ఇప్పటి ట్రెండ్‌ను కూడా రిప్రజెంట్ చేస్తుంది కదా?
ఈ సినిమా మీరు ఎప్పుడో చేయాల్సి ఉంది కదూ? ఎందుకింత ఆలస్యమైంది? నిజమే. ఈ చిత్ర కథా రచయిత చిన్నికృష్ణ 'ఆర్య' విడుదలైన వెంటనే ఈ సబ్జెక్ట్ నాకు చెప్పారు. అప్పుడే ఓకే చేశాం కూడా. అయితే ఈ పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌ను సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలిగే డైరెక్టర్ కోసం ఆగాల్సి వచ్చింది.
WD
'బద్రీనాథ్' కోసం మీరు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారని విన్నాం? అవును. ఈ చిత్రంలోని నా క్యారెక్టర్ తాలూకు బాడీలాంగ్వేజ్‌కు తగ్గట్టుగా మార్షల్ ఆర్ట్స్‌లో తర్ఫీదు పొందడం జరిగింది. ఇందుకోసం కొన్ని నెలలు వియత్నాంలో ఉండడం జరిగింది.
మీతో తమన్నా మొదటిసారి నటిస్తోంది కదా? నిజానికి ఇంతకు ముందే నేనూ, తమన్నా కలిసి నటించాల్సి ఉంది. కానీ కారణాంతరాల వల్ల కుదరలేదు. అయితే చాలా రోజులుగా మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. 'బద్రీనాథ్'లో హీరోయిన్‌గా తను ఫైనలైజ్ కావడానికి ముందే మేమిద్దరం ఫొటో సెషన్ చేశాం.
పరాజయాలు మిమ్మల్నెంత వరకు ప్రభావితం చేస్తాయి? హిట్స్ అండ్ ఫెయిల్యూర్స్‌ను ఒకేలా తీసుకుంటానని చెబితే అది ఖచ్చితంగా హిపోక్రసీ అవుతుంది. ఫెయిల్యూర్ ఖచ్చితంగా పెయిన్‌ఫుల్‌గానే వుంటుంది. అయితే నా సినిమాలకు సంబంధించిన ఫెయిల్యూర్స్‌కు నేనెవరినీ బ్లేమ్ చేయను. ఎందుకంటే నేను ఓకే చేశాను కాబట్టే ఆ ప్రాజెక్ట్ షేప్ తీసుకుంది. కాబట్టి హిట్టయితే అది నా గొప్ప అని ఫెయిలైతే ఫలానా ఫలానా వాళ్ళు చేసిన తప్పుల వల్ల అని వేరేవాళ్ళ మీద నెపం వేయడానికి నేను పూర్తిగా వ్యతిరేకం.
అల్లు అరవింద్ తనయుడు కావడం వల్ల మీకెదురైన లాభనష్టాలేమిటి? లాభాలెన్నున్నాయో నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. అంచనాలను అందుకోవడం కొన్ని సందర్భాల్లో కష్టమవుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ బాధ్యతగా మెలగాల్సి ఉంటుంది. అరవింద్ గారబ్బాయేంటి ఇలా మాట్లాడుతున్నాడు! ఇలా బిహేవ్ చేస్తున్నారు? అని అనిపించుకోకుండా ఉండడం మామూలు కష్టం కాదు కదా?
చరణ్ అర్జున్ అనే టైటిల్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ రిజిస్టర్ చేయించిందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు కదా? ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇద్దరు కలిసి నటించాలని మా ఇద్దరికీ బలంగా ఉంది. కచ్చితంగా కలిసి నటిస్తాం. అయితే ఎప్పుడనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. మూడేళ్ళు పట్టవచ్చు. అయిదేళ్ళు పట్టవచ్చు. లేదా వచ్చే ఏడాదే కావచ్చు. పర్టిక్యులర్‌గా ఫలానా అప్పుడు అని మాత్రం చెప్పలేను.
మీరు ఇంత త్వరగా పెళ్ళికి సిద్ధమవుతారని ఎవరూ ఊహించలేదు కదా? నేను యాక్ట్ చేసిన సినిమాల్లో నా క్యారెక్టర్‌ను బట్టి నా పర్సనల్ క్యారెక్టర్‌ను ఊహించుకోవడం వల్ల నా పెళ్ళి వార్త చాలామందికి షాక్ కలిగించి ఉంటుంది. అయితే నన్ను క్లోజ్‌గా అబ్జర్వ్ చేసేవాళ్ళకు మాత్రం ఇది షాక్ కాదు. సినిమాల్లో అల్లు అర్జున్ వేరు. నిజ జీవితంలో అల్లు అర్జున్ వేరు.
మీ గర్ల్‌ఫ్రెండ్స్ లిస్ట్ చాలా పెద్దదని అందరూ చెబుతుంటారు. ఈ లిస్ట్ గురించి స్నేహకు తెలుసా? (నవ్వుతూ) అందరూ అనుకునేంత పెద్ద లిస్ట్ కాదు కానీ, ఆ లిస్ట్ గురించి స్నేహకు మాత్రం చెప్పేశాను. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ ట్రాన్స్‌పరెంట్‌గా ఉండడాన్ని నేనిష్టపడతాను. ముఖ్యంగా లైఫ్ పార్ట్‌నర్ విషయంలో.
మీ జీవితంలో అత్యంత రొమాంటిక్ మూమెంట్ ఏమిటి? స్నేహాతో జరిగిన ఎంగేజ్‌మెంట్.
బిగ్గెస్ట్ సర్‌ప్రైజ్? నేను స్నేహనెప్పుడూ ఏడిపిస్తూ ఉండేవాడిని. తనతో నన్నెప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేయలేవని చెప్పేవాడిని. అయితే ఒకరోజు సడన్‌గా షూటింగ్ స్పాట్‌లో స్నేహ ప్రత్యక్షమైంది. మొదట నేను నమ్మలేదు. ఎవర్నో చూసి స్నేహ అనుకుంటున్నానేమో అనుకున్నాను. సిటీ నుంచి రానుపోను అయిదారు గంటల టైమ్ పట్టే ఆ షూటింగ్ స్పాట్‌కి వచ్చి స్నేహ నాతో స్పెండ్ చేసింది. జస్ట్ టెన్ మినిట్స్. అయితే ఆ టెన్ మినిట్స్‌ను నేను టెన్ ఇయర్స్ తర్వాత కూడా గుర్తుంచుకుంటాను అని ముగించారు అర్జున్