వివరాలలోకి వెళ్తే... ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఇండియా చిన్నారులకు హిందీ, ఇంగ్లీష్ భాషలు నేర్పే యోచనతో మరో కొత్త యాప్‌ని విడుదల చేసింది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థుల కోసం దీన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 'బోలో' పేరుతో రిలీజ్ చేయబడిన ఈ యాప్ స్పీచ్ రికగ్నిషన్, టెక్స్ట్-టు-స్పీచ్ టెక్నాలజీల సాయంతో ప్రాథమిక విద్యార్థుల కోసం రూపొందించినట్లు గూగుల్ వెల్లడించింది.
ఈ యాప్‌లో యానిమేటెడ్ క్యారెక్టర్ 'దియా' పిల్లలకు హిందీ, ఇంగ్లీష్ నేర్పించడంతోపాటు కథలు చెప్పడం, మాటలు నేర్పించడం వంటివి చేస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులు దీనిని గూగుల్ ప్లే ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా ఈ యాడ్ ఫ్రీ గూగుల్ బోలో యాప్ ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేయడం విశేషం.
గూగుల్ ఈ యాప్‌ను యాన్యువల్ స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ సెంటర్ సహాయంతో ఉత్తరప్రదేశ్‌లోని 200 గ్రామాల్లో కొన్ని నెలలపాటు పరీక్షించి కేవలం మూడు నెలలలోనే 64 శాతం మంది పిల్లలలో చదివే నైపుణ్యం పెరిగడాన్ని గుర్తించినట్లు తెలిపింది. నాణ్యమైన పాఠాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒక్కో రాష్ట్రంలో అక్షరాస్యత శాతం ఒక్కోలా ఉందని పేర్కొంది. బోలో యాప్‌తో పిల్లల్లో చదివే ఆసక్తి, నైపుణ్యం పెరుగుతుందనే ధీమాను వ్యక్తంచేసింది.