నిబంధనలకు సమ్మతి తెలిపే గడువును పొడిగించినంత మాత్రాన భారత కస్టమర్ల డేటా భద్రతకు హామీ లభించినట్టు కాదని ఐటీ శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో భారత వినియోగదారులకు డేటా ప్రైవసీ, సెక్యూరిటీకి సంస్థ నుంచి ఎలాంటి హామీ వచ్చినట్లు భావించట్లేదని తెలిపింది.
చాలా మంది భారతీయ పౌరులు రోజువారీ జీవితంలో కమ్యూనికేషన్, ఇతర అవసరాలకు వాట్సాప్‌పై ఆధారపడతారు. అందువల్ల భారతీయ వినియోగదారులపై న్యాయబద్ధం కాని నియమ, నిబంధనలను, షరతులను విధించడానికి ఒప్పుకునేది లేదని ఐటీ శాఖ స్పష్టం చేసింది.
కొత్త ప్రైవసీ పాలసీ భారతీయ చట్టాలు, నిబంధనలను అతిక్రమించేలా ఉన్నాయని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ ముందు నుంచి వాదిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ శాఖ మరోసారి వాట్సాప్‌కు నోటీసులు పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొదటి నుంచి మొండిగా వ్యవహరిస్తున్న వాట్సాప్, తాజా నోటీసులకు ఎలా స్పందిస్తుందో చూడాలి.