చాచాజీ పుట్టినరోజు.. బాలలకు పండుగ రోజు..!

FILE
నవభారత నిర్మాతగా, స్వతంత్ర భారతావని మొట్టమొదటి ప్రధానమంత్రిగా అంతులేని కీర్తిని సంపాదించిన పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టిన రోజు నవంబర్ 14. ఈ రోజున దేశంలోని చిన్నారులందరూ "బాలల దినోత్సవం"ను కన్నులపండువగా జరుపుకుంటారు. చాచాజీ జన్మదినం రోజునే బాలల పండుగను జరపటానికి కారణం.. పిల్లలపట్ల ఆయనకు ఉన్న ప్రేమే. అందుకే "జాతి భవిష్యత్తు నాలుగ్గోడల మధ్యనే రూపుదిద్దుకుంటుంది కాబట్టి.. దేశంలోని బాలబాలికల అభివృద్ధికై తన పుట్టిన రోజును బాలల దినోత్సవం"గా జరుపుకోవాలని చాచాజీ ఆకాంక్షించారు.

కాబట్టి.. చాచాజీ ఆశించినట్లుగా మన దేశంలో ప్రతి సంవత్సరం ఆయన పుట్టిన రోజైన నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంను జరుపుకుంటున్నాము. ఈ బాలల దినోత్సవాన్ని ప్రపంచంలోని అన్ని దేశాలూ ఒక్కో రోజున జరుపుకుంటాయి. అయితే మన దేశంలో మాత్రం రోజా పువ్వులన్నా, పసిపిల్లలన్నా విపరీతంగా ప్రేమించే చాచాజీ జన్మదినాన జరుపబడుతోంది.

బాలల దినోత్సవం దేశమంతటా ఒక పండుగలాగా నిర్వహించబడుతోంది. తమకంటూ ఓ ప్రత్యేక వేడుక ఉందన్న ఆనందం ఈరోజున చిన్నారుల్లో ముఖాల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని మరిపించే రీతిలో ఈ వేడుక వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా నిర్వహించే అనేక కార్యక్రమాలు పిల్లలకి మంచి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంటాయి.

తన పుట్టిన రోజును పసిపిల్లలకు పండుగ రోజుగా జరపాలని కోరుకున్న చాచాజీ జీవితం గురించి ఈ సందర్భంగా క్లుప్తంగా తెలుసుకుందాం. జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14వ తేదీన అలహాబాదులో జన్మించారు. ఆగర్భ శ్రీమంతుడైన ఈయన దేశం కోసం అన్నింటినీ త్యాగం చేసి, మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడిచి ఆయనకు రాజకీయ వారసుడిగా నిలిచారు.

గొప్ప వక్తగా, విద్యావేత్తగా, మంచి తండ్రిగా పేరు గడించిన చాచాజీ.. స్వాతంత్ర్య పోరాట కాలంలో జైళ్లలో గడపటంవల్ల ఎక్కువకాలం భార్యా పిల్లలతో గడపలేకపోయారు. సహాయ నిరాకరణోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ఈయన.. భారత జాతీయ కాంగ్రెస్‌కు 4సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు.

చాచాజీ జైలు జీవితం గడుపుతూనే "డిస్కవరీ ఆఫ్ ఇండియా" అనే గ్రంథాన్ని 1943లో రచించారు. ఈ క్రమంలో తన స్వీయ చరిత్రతో పాటు, కుమార్తె ఇందిరాగాంధీకి జైలునుంచే ఎన్నో లేఖలు రాశారు. స్వాతంత్ర్య పోరాట కాలంలో నెహ్రూ చేసే ప్రసంగాలు యువతీ యువకులను ఎంతగానో ఆకట్టుకునేవి, ఉత్తేజపరిచేవి.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెహ్రూ.. నవభారత రాజకీయ రంగంలో విశిష్టమైన పాత్రను పోషించారు. ఈ సమయంలో ఆయన అనేక పరిశ్రమలను స్థాపించి, పారిశ్రామికంగా దేశాన్ని ఎంతో ముందంజలో నడిపించారు. పంచవర్ష ప్రణాళికలను రూపొందించి అమలుపరిచారు. భారీ ఆనకట్టలను సైతం నిర్మించి వాటి ద్వారా రైతులకు నీరు అందించి పంటలు బాగా పండేందుకు దోహదపడ్డారు.

రక్షణబలం ఎక్కువగా ఉండే భారీ రాజ్యాల బారి నుంచి బడుగు దేశాలను కాపాడేందుకు చాచాజీ ఆలీనోద్యమాన్ని చేపట్టి, ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. శాంతికాముకుడైన ఈయన.. ప్రపంచ శాంతిపై చైనాతో పంచశీల ఒప్పందం కుదుర్చుకున్నారు.

తన 75 సంవత్సరాల జీవిత కాలంలో 52 సంవత్సరాలపాటు రాజకీయాల్లోనే గడిపిన చాచాజీ.. చాలా కాలం జైళ్లలోనే గడిపారు. 18 సంవత్సరాలపాటు ప్రధానమంత్రి పదవిని దీక్షా పట్టుదలలతో నిర్వహించిన ఈ త్యాగశీలి.. 1964 మే 27వ తేదీన పరమపదించారు. న్యూఢిల్లీలోని శాంతివనంలో నిర్మించిన చాచాజీ సమాధి... జాతీయ స్మారక చిహ్నంగా వెలుగొందుతోంది.

వెబ్దునియా పై చదవండి