దాదాపు 5 సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న అశ్వజిత్ నుండి తెల్లవారుజామున 4 గంటలకు తన కుటుంబ కార్యక్రమంలో పాల్గొనమని కోరుతూ తనకు కాల్ వచ్చిందని ప్రియ చెప్పింది. తన ప్రియుడు రమ్మన్న చోటికి చేరుకున్న తర్వాత కొంతమంది స్నేహితులను తను కలుసుకున్నాననీ, ఐతే అక్కడ తన బాయ్‌ఫ్రెండ్ వింతగా ప్రవర్తిస్తున్నాడని గుర్తించి అక్కడి నుంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేసింది. ప్రియ ఫంక్షన్ నుండి బయటకి వస్తుండటంతో అశ్వజిత్ తన స్నేహితుడితో కలిసి బయటకు వచ్చి తనను దుర్భాషలాడటం ప్రారంభించాడని పేర్కొంది.
తన బాయ్‌ఫ్రెండ్, అతని స్నేహితుడు దుర్భాషలాడుతుండగా అలా మాట్లాడవద్దని గట్టిగా చెప్పడంతో తన ప్రియుడు తనను చెంపదెబ్బ కొట్టాడని తెలిపింది. తనకు ఇంతకుముందే పెళ్లైన సంగతి దాచిపెట్టి తనను మోసం చేసాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇంకా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చెబుతూ... నా మెడను బిగించి చంపేయడానికి ప్రయత్నించాడు, నేను అతనిని దూరంగా నెట్టడానికి ప్రయత్నించాను. నా చేతిని కొరికాడు, కొట్టాడు, నా జుట్టును పట్టుకుని లాగాడు. అతని స్నేహితుడు నన్ను నేలపైకి నెట్టాడు" అని రాసింది. ఇంతలో అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు తన కారు నుండి తన ఫోన్, ఇతర వస్తువులను తీసుకునేందుకు ప్రయత్నించినప్పుడు, అశ్వజిత్ తన డ్రైవర్‌ను ఆమె గొంతు కోయాలని కోరినట్లు బాధితురాలు చెప్పింది. ఈ పెనుగులాట సాగుతుండగానే ఆమె కిందపడిపోయింది. ఆ తర్వాత ఆమె పైకి కారును నడపడంతో కాలు ఫ్రాక్చరైంది. భుజానికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై ఆమెను అలాగే వదిలేసి ప్రియుడు పారిపోయాడు. దాదాపు అరగంట తర్వాత దారినే పోయే ఓ వ్యక్తి సాయంతో ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు, అక్కడ ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
"నా కుడి కాలు విరిగింది. నేను శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది, నా కుడి కాలుకు రాడ్ పెట్టవలసి వచ్చింది, నా శరీరమంతా గాయాలు ఉన్నాయి, నా చేతులు, నా వీపు, నా కడుపు ప్రాంతంలో లోతుగా గాయాలయ్యాయి. కనీసం 3-4 నెలలు బెడ్ పై నుంచి లేవలేని స్థితిలో వున్నాను. మరో 6 నెలలు నడవడానికి సమయం పడుతుంది” అని ప్రియా సింగ్ ఆసుపత్రిలో పోలీసులకు చెప్పారు. కాగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు అయ్యింది కానీ నిందితుడిని ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.