ప్రస్తుతం యుద్ధ పరిస్థితులను తీసిపోలేదు : ప్రధాని మోడీ వ్యాఖ్యలు

సోమవారం, 6 ఏప్రియల్ 2020 (13:28 IST)
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఇపుడు దేశంలోని పరిస్థితులు యుద్ధ పరిస్థితుల కంటే తక్కువేం కాదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ 40వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ఆ పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. 
 
ఇందులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మన తల్లులు, సోదరీమణులు గతంలో యుద్ధాలు జరిగిన సమయంలో వారి ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులు యుద్ధ పరిస్థితుల కంటే తక్కువేం కాదు. మనుషులను రక్షించాల్సిన యుద్ధం ఇది. ప్రతి బీజేపీ కార్యకర్త పీఎం కేర్స్‌ ఫండ్‌కు సాయం చేయాలి. మరో 40 మందిని ఇదే పని చేసే విధంగా ప్రోత్సహించాలి' అని చెప్పారు.
 
'ఎక్కడికి వెళ్లినా మీ ముఖానికి మాస్కులు ధరించండి. మీ ఇంట్లో ఉన్నా ముఖానికి మాస్కులు ధరించే ఉండాలి. కరోనా కట్టడికి ప్రపంచం జపిస్తోన్న మంత్రం ఒక్కటే.. సామాజిక దూరం పాటించాలి, క్రమశిక్షణతో మెలగాలి. ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను అభివృద్ధి చేసింది' అని గుర్తుచేశారు.
 
ఈ యాప్‌ను ప్రతి ఒక్కరూ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తమ చుట్టూ ఉన్న కరోనా బాధితుల గురించి దీని వల్ల వారికి తెలుస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఈ విషయాలను తెలుసుకోవడం ముఖ్యం అని చెప్పుకొచ్చారు. 
 
ఆదివారం రాత్రి 9 గంటలకు 130 కోట్ల మంది ఐక్యతను చూశాం. కరోనాపై జరుగుతున్న పోరాటంపై అన్ని వర్గాల ప్రజలు, అన్ని వయసుల వారు తమ ఐక్యతను చాటారు. భారత్‌లాంటి అతి పెద్ద దేశంలో లాక్‌డౌన్‌ను ఇంతటి క్రమశిక్షణతో పాటిస్తున్నారు అని కొనియాడారు. 
 
'ఇంతకు ముందు ఎన్నడూ ఇటువంటి సంఘటనలు జరగలేదు. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచానికి భారత్‌ ఉదాహరణగా నిలిచింది. ఈ వైరస్‌ తీవ్రత గురించి ముందుగానే అర్థం చేసుకున్న దేశాల్లో భారత్‌ ఒకటి. భారత్‌ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని, శక్తి మేరకు అమలు చేస్తోంది' అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు