నేడు నిర్భయ దోషులకు డమ్మీ ఉరి.. ఇసుక బస్తాలతో ట్రయల్స్

బుధవారం, 18 మార్చి 2020 (11:39 IST)
దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచార కేసులో దోషులుగా తేలిన నలుగురు ముద్దాయిలకు బుధవారం ఉరి ట్రయల్స్ నిర్వహించనున్నారు. ఈ ట్రయల్స్‌ను తలారి నిర్వహించనున్నారు. 
 
కోర్టు ఆదేశాల మేరకు నిర్భయ దోషులను ఈ నెల 20వ తేదీన ఉరి తీసేందుకు జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ కేసులో దోషులైన ముకేష్ సింగ్, అక్షయ్ సింగ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలకు ఉరి తీసేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సెంట్రల్ జైలు నుంచి తలారీ ఢిల్లీలోని తిహార్ జైలుకు వచ్చారు. 
 
నిర్భయ దోషుల ఉరికి ముందు వారి బరువును బట్టి ఇసుక బస్తాలతో తిహార్ జైలు గదిలో బుధవారం డమ్మీ ఉరి కార్యక్రమాన్ని జైలు అధికారులు చేపట్టారు. ఒక వైపు నిర్భయ దోషుల ఉరికి తిహార్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. 
 
మరోవైపు, నలుగురు దోషుల్లో ఒకరైన పవన్ కుమార్ గుప్తా సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచార ఘటన జరిగినపుడు తాను మైనర్‌నని, అందుకే తన ఉరిని రద్దు చేసి యావజ్జీవ కారాగార శిక్షగా మార్చాలని పవన్ కుమార్ గుప్తా కోరాడు. 
 
అలాగే, మరో దోషి అక్షయ్ తనకు క్షమాభిక్ష ప్రసాదించాలని జైలు అధికారులకు రెండోసారి పిటిషన్ సమర్పించాడు. జైలు అధికారులు దీన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖకు పంపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు