నల్లడబ్బు చెత్తను ఊడ్చేస్తా.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తా : నరేంద్ర మోడీ

శుక్రవారం, 11 నవంబరు 2016 (07:51 IST)
నల్లడబ్బు రూపంలో మూలుగుతున్న చెత్తను పూర్తిగా ఊడ్చేసి.. దేశాన్ని అవినీతి రహిత భారత్ చేస్తానని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. దేశంలో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తాను చేసిన సంచలన ప్రకటనపై ఆయన తొలిసారి పెదవి విప్పారు. ఈ మేరకు ఆయన గురువారం ట్వీట్ చేశారు. 
 
అవినీతి భారతాన్ని ఆవిష్కరించేందుకు తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తుందని పునరుద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి ఊగిసలాట నిర్ణయాలూ ఉండవని తేల్చి చెప్పారు. ‘‘దేశంలో అవినీతిని రూపుమాపేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటాం’’ అని భరోసా ఇచ్చారు. 
 
అయితే, ఆరంభంలో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు సహకరించారని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు చాలా ఓపికతో సహనంతో పాత నోట్లను బ్యాంకులకు తీసుకెళ్లి మార్చుకుంటున్నారు. వారి స్పందన చూస్తుంటే సంతోషంగా ఉంది’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. 

వెబ్దునియా పై చదవండి