తమిళనాడులో జయలలిత మరణించాక పరిస్థితులు రకరకాలుగా మారుతున్నాయి. ఆమె అలా అస్తమించగానే చెన్నై కేంద్రంగా ఆదాయపన్ను శాఖ ముమ్మర దాడులు చేస్తోంది. ఇటీవలే తితిదే మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంటిపై దాడులు చేసిన ఐటీ శాఖ ఆయన నుంచి కోట్ల రూపాయల నగదు, కిలోలకొద్దీ బంగారంతో పాటుగా పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది. ఈ పత్రాలను పరిశీలించిన ఐటీ శాఖకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుకు శేఖర్ రెడ్డికి డబ్బు లావాదేవీల్లో సన్నిహిత సంబంధాలున్నట్లు నిర్థారణకు వచ్చింది.
ఈ నేపధ్యంలో ఆయన ఇళ్లు, ఆఫీసులు, కుమారుడి ఇంటిపైనా మెరుపు దాడులు చేస్తోంది. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిపైన ఐటీ దాడులు చేయాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వాలని అంటుంటారు. మరి రామ్మోహన్ రావు ఇళ్లపై ఐటీ దాడులు చేసేందుకు పన్నీర్ సెల్వం ఓకే చెప్పేశారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు రామ్మోహన్ రావు, జయలలిత నెచ్చెలి శశికళకు కూడా మంచి సంబంధాలున్నాయనీ, ఆమెకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో సలహాలు, సూచనలు చేస్తుంటారని సమాచారం.
ఇదిలావుంటే ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ఇళ్లపై ఐటీ దాడులు చేస్తున్న క్రమంలో ఆయన ఇంటి వద్ద తమిళనాడు పోలీసు బలగాలు కాకుండా కేంద్ర బలగాలను మోహరించడం ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఒకవేళ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే జరిగితే మరింతమంది పెద్దతలకాయలపై ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపైనే ఐటీ దాడులు జరుగుతుండటంతో అన్నాడీఎంకె నేతల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు ఏ క్షణంలో ఐటీ అధికారులు తమ ఇళ్లపై దాడులు చేస్తారోనన్న భయంతో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రామ్మోహన్ రావు తెలుగు వ్యక్తి. జయలలితకు నమ్మినబంటుగా ఆయనకు పేరుంది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ.