కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే రీతిలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా ఇప్పటికే సీఐఐ, ఫిక్కీ వంటి వాణిజ్య విభాగాలతో చర్చలు జరిపిన కేంద్రం నిషేధ వస్తువుల జాబితాను వాటితో పంచుకుంది. ఆ జాబితాలో పెయింట్లు, వార్నిష్‌లు, ప్రింటింగ్ ఇంక్, మేకప్ సామగ్రి, హెయిర్ జెల్స్, వీడియో గేమ్ కన్సోల్స్, క్రీడా పరికరాలు, సిగరెట్లు, గాజు పలకలు, రియర్ వ్యూ మిర్రర్లు, వాచీలు ఉన్నాయి.
శనివారం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆత్మ నిర్భర్ భారత్ పథకంతో పాటు, చైనా ఉత్పత్తుల దిగుమతిపై నిషేధం విధించే అంశంపైనా చర్చించారు. అయితే, అనేక మంత్రిత్వ శాఖలు కూడా ఇలాంటి జాబితాలు రూపొందించినట్టయితే, దేశీయంగా తయారైన ఏ వస్తువులకు అయితే, చైనా వస్తువులు పోటీగా మారాయన్నది గుర్తించి, వాటిపైనే నిషేధం విధించాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తంమీద చైనా వస్తువులపై నిషేధం తథ్యమని తెలుస్తోంది.