జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు.. శశికళ అత్యవసర సమావేశం.. ఎమ్మెల్యేలకు పిలుపు..

సోమవారం, 3 అక్టోబరు 2016 (09:20 IST)
తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై తమిళనాట ఆందోళన రోజు రోజుకీ మరింత పెరుగుతోంది. ముఖ్యమంత్రి జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఇంకొన్ని రోజులు ఆస్పత్రిలోనే ఉండాలని వైద్యులు తెలిపారు. అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలందరూ చెన్నై రావాలని జయ నెచ్చెలి శశికళ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం చెన్నైలో అత్యవసరంగా ఆమె సమావేశం కానున్నారని తెలిసింది. అర్జెంటుగా రావాలంటూ సమాచారం అందుకున్న పార్టీ నేతలు జయలలిత ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు
 
మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి వైద్యులు ఆదివారం రాత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. లండన్‌కు చెందిన డాక్టర్ రిచర్డ్ బాలే నేతృత్వంలో ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. లండన్ వైద్యుడు బాలే ట్రీట్‌మెంట్‌కు ఆమె త్వరలో కోలుకుంటారని తెలిపారు. జయలలిత వైద్య పరీక్షల నివేదికలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించి, అపోలో సీనియర్ వైద్యులతో చర్చించి చికిత్స అందిస్తున్నారని వివరించారు.
 
మెరుగైన వైద్యం కోసం యాంటీ బయోటిక్స్ అందిస్తున్నామని చెప్పారు. ఇన్ఫెక్షన్ నివారణకు మెరుగైన పద్ధతుల్లో చికిత్స చేస్తున్నట్టు తెలిపారు. చికిత్సకు జయలలిత స్పందిస్తున్నారని, మరికొన్ని రోజులు ఆమెను ఆస్పత్రిలోనే ఉంచాల్సివుంటుందని తెలిపారు.  
 
ఇకపోతే.. జయలలిత ఆరోగ్యంపై నెట్లింట్లో రకరకాల పుకార్లు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియాలో జయ ఆరోగ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే అమ్మకు సంబంధించిన ఒక ఫొటో వైరల్‌గా మారింది. జయలలిత ఆసుపత్రి బెడ్‌పైన ఆక్సిజన్‌ మాస్క్‌ పెట్టుకుని చికిత్స తీసుకుంటున్నట్లు ఉన్న ఫొటో ఒకటి నెట్లో చక్కర్లు కొడుతోంది. దీనిని చూసిన అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఆ ఫొటోను అనేకమంది షేర్‌ చేస్తున్నారు. జయలలిత ఆరోగ్యం పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదని, అభిమానులు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని ఆ పార్టీ నాయకులు సరస్వతి తెలిపారు.
 
మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీఎచ్‌ విద్యాసాగర్‌ రావు శనివారం రాత్రి ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. అనారోగ్యంతో ఉన్న సీఎం జయలలిత కోలుకుంటున్నారని ప్రకటించారు. అనంతరం రాజ్‌భవన్‌కు వెళ్లిన విద్యాసాగర్‌రావు ఈ ప్రకటన వెలువరించారు. జయలలిత త్వరగా సంపూర్ణంగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. 

వెబ్దునియా పై చదవండి