ప్రేమోన్మాది ఘాతుకానికి మరో యువతి బలైపోయింది. తనను ప్రేమించాలంటూ వెంటబడి వేధించిన ఆ రాక్షసుడు చివరికి ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కమలేశ్ సాహూ, సుప్రియా జైన్ అనే ఇద్దరూ ప్లస్ టూ వరకూ కలిసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారు స్నేహితులయ్యారు. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. అతడి విన్నపాన్ని ఆమె సున్నితంగా తిరస్కరించింది.
కానీ ఆ ప్రేమోన్మాది మాత్రం ఆమెను వదల్లేదు. ప్రేమిస్తావా లేదా అంటూ చేయిని కోసుకున్నాడు. అతడి గొడవ తట్టుకోలేని సుప్రియా అక్కడి నుంచి ఉన్నత చదువుల కోసం ఇండోర్ వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడికి తన చిరునామా తెలియకుండా జాగ్రత్తపడింది. కానీ ఈ నరరూప రాక్షసుడు ఆమెను ఫేస్ బుక్ ద్వారా ట్రేస్ చేశారు. ఆమె అడ్రెస్ తెలుసుకుని అక్కడికి వెళ్లాడు. ఆమె కార్యాలయంలో మరొకరితో సన్నిహితంగా మాట్లాడుతూ కనిపించడంతో ఇక ఆమెను చంపేయాలని నిర్ణయానికి వచ్చాడు.
గురువారం రాత్రి ఒంటరిగా ఆమె వెళ్తున్న సమయంలో మాటు వేసి కత్తితో విచక్షణా రహితంగా 38 సార్లు పొడిచాడు. ముఖంపైనా, శరీరంపైనా ఇష్టమొచ్చినట్లు పొడిచి ఆమె పైకి ఎక్కి కూర్చుని పిచ్చివాడిలా కేకలు వేయడం మొదలుపెట్టాడు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సుప్రియాను ఆసుపత్రికి తరలించగా... ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్థారించారు.