తమిళ రాజకీయాలపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. తమిళ పీఠం కోసం పోటీ పడిన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం, అన్నాడీంకే శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన వీకే శశికళపై రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా జోకులు పేలుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఇవి హల్ చల్ చేస్తున్నాయి.
శశికళ వెంట అంతమంది ఎమ్మెల్యేలు ఎలా వెళ్లారన్న ప్రశ్నకు... 'నాపై వున్న అక్రమాస్తుల కేసు తీర్పు రాబోతోంది. నా తదుపరి సీఎం ఎవరన్నది చర్చిద్దాం రండి' అంటూ పిలవగానే ఎమ్మెల్యేలంతా ఆమె వద్దకు పరుగులు తీశారనే జోక్ ప్రస్తుతం వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో వైరల్ అయ్యింది.
మరోవైపు శశకళపై తిరుగుబాటు చేసిన పన్నీర్ సెల్వంను కబాలీ సినిమాలో రజనీకాంత్‌తో పోలుస్తున్నారు. 'పాత రోజుల్లో లాగా నుదుటున బొట్టు పెట్టుకుని, పంచె కట్టుకుని.. 'ఏయ్ సెల్వం' అని పిలవగానే చేతులు కట్టుకుని 'చిత్తం చిన్నమ్మా' అని వినయంగా నిలబడడానికి మునుపటి పన్నీర్‌సెల్వం అనుకుంటున్నావా? సెల్వం అమ్మా.. పన్నీ....ర్‌సెల్వం' అంటూ మరో జోకు పేలుతోంది.
ఇదిలా ఉంటే, అక్రమాస్తుల కేసులో తనను సుప్రీంకోర్టు దోషిగా ప్రకటించడంతో శశికళ షాక్ అయ్యింది. ఈ కేసు నుంచి తాను నిర్దోషిగా బయటపడగలనని ఆశిస్తూ వచ్చిన ఆమె.. ఈ తీర్పుతో తీవ్ర నిరాశకు గురై దిక్కు తోచని స్థితిలో పడిపోయింది. పోయెస్ గార్డెన్ వెలవెలబోయింది. కోర్టు ఆదేశానుసారం చెన్నైలో ఆమె పోలీసులకు లొంగిపోవలసి ఉంటుంది.